Tue Dec 24 2024 00:33:02 GMT+0000 (Coordinated Universal Time)
అంగన్ వాడీలపై ఎస్మా ప్రయోగించిన ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ లో సమ్మె చేస్తున్న అంగన్ వాడీలపై ప్రభుత్వం ఊహించని నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ లో సమ్మె చేస్తున్న అంగన్ వాడీలపై ప్రభుత్వం ఊహించని నిర్ణయం తీసుకుంది. అంగన్ వాడీలపై ఎస్మా చట్టం ప్రయోగించింది. అంగన్ వాడీలను ఎమర్జెన్సీ సర్వీసులలోకి చేర్చి, ఆరు నెలల పాటు సమ్మెలు, నిరసనలు నిషేధమంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు శనివారం జీవో నెం.2 విడుదల చేసింది. గడిచిన 26 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్ల వేతనాల్లోనూ ప్రభుత్వం కోత విధించింది. సమ్మెలో ఉన్న కాలానికి సంబంధించి వేతనం కట్ చేసింది. నెలనెలా వర్కర్ల ఖాతాలో పడుతున్న రూ. 10 వేల వేతనం స్థానంలో ప్రభుత్వం ఈ నెల రూ.8050 మాత్రమే జమ చేసింది. వేతనాల పెంపుతో పాటు గ్రాట్యుటీ కోసం అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్లు ఆందోళన చేస్తున్నారు.
పలు డిమాండ్ల సాధన కోసం ఆంధ్రప్రదేశ్ లో అంగన్ వాడీ వర్కర్లు దాదాపు నెల రోజులుగా సమ్మె చేస్తున్నారు. సమ్మె చేస్తున్న అంగన్ వాడీ సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరిపింది. అయితే ఈ చర్చలు సఫలం కాలేదు. దీంతో అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్లు సమ్మె నిర్వహిస్తున్నారు. ఎస్సెన్సియల్ సర్వీసెస్ మెయిన్ టెనెన్స్ యాక్ట్ నే ఎస్మాగా పిలుస్తారు. సమ్మెలు, ఇతరత్రా నిరసన కార్యక్రమాలతో ప్రజల సాధారణ జీవనానికి ఇబ్బందులు కలగకుంగా ఉండేందుకు గాను 1981లో ఎస్మా చట్టాన్ని రూపొందించారు అత్యవసర సేవలు అందించే ఉద్యోగులు విధులకు హాజరు కాకుండా సమ్మెలోకి దిగితే ఎస్మా చట్టాన్ని ప్రయోగించే అధికారం ప్రభుత్వాలకు ఉంటుంది. ఎస్మాను ఉల్లంఘిస్తే వారంట్ లేకుండానే అరెస్ట్ చేయవచ్చు.
Next Story