Mon Dec 23 2024 13:50:11 GMT+0000 (Coordinated Universal Time)
ఒమిక్రాన్ అలజడి - ఏపీలో డోర్ టు డోర్ ఫీవర్ సర్వే
తెలంగాణలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 20 దాటగా.. ఏపీలో ఇప్పుడిప్పుడే ఒమిక్రాన్ ఊపిరిపోసుకుంటోంది. దాంతో అప్రమత్తమైన ప్రభుత్వం డోర్ టు డోర్ ఫీవర్ సర్వే
కరోనా కొత్త వేరియంట్ ప్రపంచదేశాలను ఎంతగా హడలెత్తిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచంలో నమోదవుతున్న రోజువారి ఒమిక్రాన్ కేసులు.. మళ్లీ 2020 సంవత్సరాన్ని గుర్తుచేస్తున్నాయి. భారత్ లోనూ ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తెలంగాణలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 20 దాటగా.. ఏపీలో ఇప్పుడిప్పుడే ఒమిక్రాన్ ఊపిరిపోసుకుంటోంది. దాంతో అప్రమత్తమైన ప్రభుత్వం డోర్ టు డోర్ ఫీవర్ సర్వేను ప్రారంభించింది. నేటి నుంచే ఈ కార్యక్రమం ప్రారంభమైంది.
కోవిడ్ లక్షణాలుంటే..
ఒమిక్రాన్ భయంతో ఇప్పటికే గన్నవరం, రేణిగుంట, వైజాగ్ ఇలా రాష్ట్రంలో ఉన్న విమానాశ్రయాలన్నింటిలోనూ ప్రతి ప్రయాణికుడికి కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహిస్తోంది ఏపీ ఆరోగ్య శాఖ. నేటి నుంచి వారంలో ఐదురోజులు అంటే సోమవారం నుంచి శుక్రవారం వరకూ ఆశావర్కర్లు, వాలంటీర్లు డోర్ టు డోర్ ఫీవర్ సర్వే నిర్వహించనున్నారు. ప్రతి ఇంటికి వెళ్లి.. ఆ ఇంట్లోని కుటుంబ సభ్యుల ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోనున్నారు. ఎవరికైనా జ్వరంతో పాటు ఇతర కోవిడ్ లక్షణాలుంటే.. వారి వివరాలను మెడికల్ ఆఫీసర్ కు పంపిస్తారు. ఆ తర్వాత కోవిడ్ నిర్థారణ పరీక్షలు చేసి, బాధిత వ్యక్తి ఐసోలేషన్ లో ఉండాలో.. లేదో సూచిస్తారు.
పాజిటివ్ గా తేలితే..
కోవిడ్ నిర్థారణ పరీక్షల్లో పాజిటివ్ గా తేలితే..జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలకు పంపిస్తారు. ఉచితంగా మందుల కిట్ ఇవ్వడంతో పాటు వైద్యుల పర్యవేక్షణలో కావాల్సిన సహాయం కూడా చేస్తారు. ఈ సర్వేలో సేకరించిన డేటా మొత్తాన్ని సిబ్బంది ఆన్ లైన్ లో నిక్షిప్తం చేయనున్నారు.
Next Story