Mon Dec 23 2024 04:54:41 GMT+0000 (Coordinated Universal Time)
నేటి నుంచి ఏపీలో టెన్త్ పరీక్షలు.. అరగంట ఆలస్యమైనా పరీక్ష రాయొచ్చు !
ఈ ఏడాది సబ్జెక్టుకు ఒక పేపర్ చొప్పున.. మొత్తం ఏడు పరీక్షలే జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం..
అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది సబ్జెక్టుకు ఒక పేపర్ చొప్పున.. మొత్తం ఏడు పరీక్షలే జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులు పరీక్ష కేంద్రానికి అరగంట ఆలస్యంగా వచ్చినా అనుమతించాలని ఆయా పరీక్షా కేంద్రాలకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే.. ఫీజు చెల్లిస్తేనే హాల్ టికెట్లు ఇస్తామంటూ ప్రైవేటు పాఠశాలలు.. విద్యార్థులపై ఒత్తిడి తీసుకొస్తున్న నేపథ్యంలో హాల్ టికెట్లను నేరుగా వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించింది.
హాల్ టికెట్లపై హెడ్ మాస్టర్ సంతకం లేకపోయినా అనుమతించాలని ఆదేశాలు ఇచ్చినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగ డైరెక్టర్ దేవానందరెడ్డి తెలిపారు. ఈ ఏడాది మొత్తం 6,22,537 మంది విద్యార్థులు టెన్త్ పరీక్షలు రాయనున్నారు. వీరిలో 3,02,474 మంది బాలికలు, 3,20,063 బాలురు ఉన్నారు. పరీక్ష కోసం మొత్తం 3,776 కేంద్రాలను ఏర్పాటు చేశారు. సరైన కారణం చెబితే.. అరగంట ఆలస్యమైనా అనుమతించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. కరోనా కారణంగా.. రెండేళ్ల తర్వాత రాష్ట్రంలో టెన్త్ పరీక్షలు జరుగుతున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.
Next Story