ఏపీలో భారీ వర్షాలు....
మత్స్య కారులకు హెచ్చరిక బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 24 గంటల్లో దక్షిణ ఒడిశా, దక్షిణ ఛత్తీస్గఢ్ మీదుగా ప్రయాణించే అవకాశముందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది
మత్స్య కారులకు హెచ్చరిక
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 24 గంటల్లో దక్షిణ ఒడిశా, దక్షిణ ఛత్తీస్గఢ్ మీదుగా ప్రయాణించే అవకాశముందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురువనున్నాయి.
మరోవైపు వాయవ్య బంగాళాఖాతంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని ఒడిశా, ఉత్తర కోస్తాంధ్ర తీరాల వద్ద మంగళవారం అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. సముద్ర మట్టానికి 7.6 కి.మీ. ఎత్తులో విస్తరించి నైరుతి వైపునకు వంగి ఉంది. ఈ అల్పపీడనం బుధవారం దక్షిణ ఒడిశా, ఛత్తీస్గఢ్ మీదుగా పశ్చిమ దిశలో పయనించే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.
మరోవైపు ఉపరితల ద్రోణి అల్పపీడన ప్రాంతం నుంచి ఆగ్నేయ ఉత్తరప్రదేశ్ వరకు కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రానున్న రెండు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి.
ఆవర్తనాల ప్రభావంతో గంటకు 40-45 కి.మీ, గరిష్టంగా 55 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులెవరూ రానున్న మూడు రోజులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.
- Tags
- ap
- heavyrains