Sun Dec 22 2024 01:14:04 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పై చేయి.. ఫలితాలు చెక్ చేసుకోండిలా
ఇంటర్ ఫస్టియర్ లో 61శాతం మంది ఉత్తీర్ణత సాధించగా.. సెకండియర్ లో 72 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. అత్యధిక ఉత్తీర్ణత..
ఏపీ ఇంటర్మీడియట్ మొదటి, రెండవ సంవత్సరాల ఫలితాలను బుధవారం సాయంత్రం 6.30 గంటలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. నిజానికి సాయంత్రం 5 గంటలకే ఫలితాలు విడుదల కావాల్సి ఉండగా.. గంటన్నర ఆలస్యంగా ఫలితాలను విడుదల చేశారు. అయితే ఈ సారి కూడా ఇంటర్ ఫలితాల్లో బాలికల హవా కొనసాగింది. మొదటి, రెండో సంత్సర ఫలితాలలో అమ్మాయిలు సత్తా చాటారు.
ఇంటర్ ఫస్టియర్ లో 61శాతం మంది ఉత్తీర్ణత సాధించగా.. సెకండియర్ లో 72 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. అత్యధిక ఉత్తీర్ణత సాధించిన జిల్లాలో కృష్ణజిల్లాకు మొదటి స్థానం దక్కింది. ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో.. కృష్ణాజిల్లాలో 75 శాతం మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు పాసయ్యారు. 70 శాతం ఉత్తీర్ణతతో గుంటూరు, 68 శాతం ఉత్తీర్ణతతో పశ్చిమగోదావరి జిల్లాలో రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. అలాగే సెకండియర్ ఫలితాల్లో 83 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా మొదటి స్థానంలో నిలవగా, 78 శాతం ఉత్తీర్ణతతో గుంటూరు రెండో స్థానం, 77 శాతం ఉత్తీర్ణతతో పశ్చిమగోదావరి తృతీయ స్థానంలో నిలిచాయని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఆఖరి స్థానంలో విజయనగరం జిల్లా ఉంది. ఈ జిల్లాలో అత్యల్పంగా 57 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.
ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు 4 లక్షల 33వేల 275మంది విద్యార్థులు హాజరవగా.. 2లక్షల 66వేల 326 మంది పాస్ అయ్యారు. సెకండియర్ పరీక్షలకు 3లక్షల 79వేల 758 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 2లక్షల 72వేల 001 మంది పాస్ అయ్యారు. ఇంటర్ పరీక్షల ఫలితాల కోసం https://examresults.ap.nic.in లేదా www.bie.ap.gov.in వెబ్ సైట్స్ చూడండి.
ఇంటర్ ఫలితాల్లో విద్యార్థులకు ఎలాంటి అభ్యంతరాలున్నా తెలియజేయాలని, ఏప్రిల్ 27 నుండి మే 6 వరకూ రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కు దరఖాస్తు చేసుకునేందుకు ఇంటర్ బోర్డు అవకాశం కల్పించినట్లు మంత్రి తెలిపారు. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుండి జూన్ 1 వరకూ రెండు విడతలుగా నిర్వహిస్తామన్నారు. మే 6 నుండి జూన్ 9 వరకూ ప్రాక్టికల్స్ ఉంటాయని, మే 3 లోగా సప్లిమెంటరీ ఫీజు చెల్లించుకోవాలన్నారు. కాగా.. మంత్రి సొంత జిల్లా అయిన విజయనగరం జిల్లాలో ఉత్తీర్ణత శాతం తక్కువగా రావడంపై ఆయన స్పందించారు. జిల్లాలో ఉత్తీర్ణత తగ్గడంలో ఉన్న లోపాలను గుర్తించి మెరుగైన ఫలితాలు వచ్చేలా కృషి చేస్తామన్నారు.
Next Story