Mon Dec 23 2024 13:00:39 GMT+0000 (Coordinated Universal Time)
ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే చెప్పుదెబ్బలే : బొండా ఉమకు వాసిరెడ్డి వార్నింగ్ !
బోండా ఉమకు చంద్రబాబు చీరకట్టి పంపించాడని, బోండా ఉమ తన పేరును సార్థకం చేసుకుంటున్నాడని, టీడీపీ ఉత్తమ నారి బోండా ఉమ..
అమరావతి : విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో మానసిక వికలాంగురాలిపై జరిగిన అత్యాచార ఘటనతో ఏపీలో రాజకీయ విబేధాలు భగ్గుమన్నాయి. ఒకరకంగా రాష్ట్రంలో అత్యాచార రాజకీయం జరుగుతోంది. రెండు మూడ్రోజులుగా వైసీపీ-టీడీపీ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఒకరినొకరు దూషించుకుంటూ ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ముఖ్యంగా.. ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, టీడీపీ నేతల మధ్య మాటల తూటాలు ఇంకా పేలుతూనే వున్నాయి.
"నువ్వు ఒరేయ్ అంటే మేం ఒసేయ్ అనలేమా... అత్యాచారం జరిగిన మూడ్రోజుల తర్వాత ముఖానికి మేకప్ వేసుకుని పరామర్శకు వచ్చారు, అన్నీ అబద్ధాలే చెప్పారు" అంటూ వాసిరెడ్డి పద్మపై టీడీపీ నేత బోండా ఉమ ధ్వజమెత్తారు. దీనిపై వాసిరెడ్డి పద్మ స్పందించారు. "బోండా ఉమా.. నీ నోటికొచ్చినట్టు మాట్లాడొద్దు.. నీకు ముందుంది మొసళ్ల పండగ. కాలకేయుడిలాంటి నీకు మహిళలే బుద్ధి చెబుతారు. మహిళల పట్ల మరోమారు అమర్యాదగా మాట్లాడితే చెప్పుదెబ్బలు తింటావు" అంటూ హెచ్చరించారు. తమకేమీ పబ్లిసిటీ పిచ్చి లేదని పద్మ తెలిపారు. రాజకీయ పబ్బం గడుపుకోవడానికే బోండా ఉమ ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.
బొండా ఉమా కారణంగా.. కాలకేయ ముఠాకు నాయకుడు చంద్రబాబు అంటూ బాబుకు చెడ్డపేరు వచ్చిందని టిడిపి నేతలే బొండా ఉమను తిడుతున్నారని ఎద్దేవా చేశారు.తనను మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవి నుంచి దించేవరకు పోరాడాలని బోండా ఉమకు చంద్రబాబు చీరకట్టి పంపించాడని, బోండా ఉమ తన పేరును సార్థకం చేసుకుంటున్నాడని, టీడీపీ ఉత్తమ నారి బోండా ఉమ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. బొండా ఉమను తాను ఇప్పటి వరకూ ఆకురౌడీ అనే అనుకున్నానని.. తాజా పరిణామాలతో చిల్లర రౌడీ అని అర్థమైందని వ్యంగ్యంగా మాట్లాడారు.
Next Story