ఇదే బాబుకి.. జగన్ కి ఉన్న తేడా
ఏపీ రాజధాని అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సీఎం జగన్ సంకల్పించారని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ తెలిపారు.
ఏపీ రాజధాని అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సీఎం జగన్ సంకల్పించారని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ తెలిపారు. రేపు 50 వేలకుపైగా పేద కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇవ్వబోతున్నామన్నారు. సీఎం జగన్ పేదల పక్షాన నిలబడితే.. చంద్రబాబు పెత్తందారుల పక్షాన నిలబడ్డారని మంత్రి జోగి రమేష్ అన్నారు. ఏ రాష్ట్రంలోనైనా ప్రతిపక్ష పార్టీలు పేదల పక్కన నిలబడతాయని, అయితే ఏపీలో మాత్రం నారా అండ్ కో టీమ్ పేదలను వదిలేసి నయా పెత్తందారుల పక్కన నిలబడిందన్నారు.
పేదలు ఇళ్లు కట్టుకోకూడదు, పేదలు పేదలలాగానే ఉండాలి, నిరుపేదలైన అక్కా చెల్లెమ్మలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదని చెప్పి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా కొన్ని కోట్ల రూపాయలు పెత్తందారుల తరఫున చంద్రబాబు ఖర్చు పెట్టారని జోగి రమేష్ ఆరోపించారు. పెత్తందారులు విజయం సాధించాలని చంద్రబాబు కుట్రలు పన్నారని, అయితే ఆఖరుకు పేదలే గెలిచారని రమేష్ పేర్కొన్నారు. చివరకు పేదల తరఫున పోరాటం చేసి.. చంద్రబాబు పెత్తందారీ వ్యవస్థను బద్దలు కొట్టామన్నారు.
రేపు 50 వేలకుపైగా పేద కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇస్తామని, త్వరలోనే ఇళ్లు కూడా కట్టి ఇస్తామన్నారు. హైకోర్టు, సుప్రీం కోర్టు కూడా పేదల పక్షానే నిలబడ్డాయన్నారు. సెంటు స్థలం గురించి ఇష్టానుసారంగా మాట్లాడిన చంద్రబాబును, టీడీపీని అదే సెంటు స్థలంలో పాతరేయబోతున్నామన్నారు. చంద్రబాబు రియల్ ఎస్టేట్ బ్రోకర్ అని దుయ్యబట్టారు. పేదలు పేదలుగానే ఉండాలని పెత్తనం తమ చేతుల్లో ఉండాలనే స్వభావం చంద్రబాబుదని మంత్రి రమేష్ మండిపడ్డారు. రాజధానిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఉంటే చంద్రబాబు అంటరానితనమా? అంటూ ప్రశ్నించారు. మిమ్మల్ని కోస్తే పసుపు రక్తం వస్తుందా? అంటూ ప్రశ్నించారు.