Sun Mar 16 2025 23:37:59 GMT+0000 (Coordinated Universal Time)
బెజవాడలో ఉద్రిక్తం.. పోలీసుల అదుపులో దేవినేని ఉమ
హెల్త్ యూనివర్సిటీ ఆలోచన చేసిందే ఎన్టీఆర్ అని, అలాంటిది ఆయన పేరు తొలగించడం దారుణమని ..

ఏపీ ప్రభుత్వం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మారుస్తున్నట్లు నేటి అసెంబ్లీ సమావేశంలో చెప్పడంతో.. టీడీపీ నేతలు భగ్గుమన్నారు. ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరును ఏ రకంగా మారుస్తారని, ఎన్టీఆర్ పేరు తీసి వైఎస్సార్ పేరు ఎలా పెడతారని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీకి వైఎస్సార్ పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ.. విజయవాడ గొల్లపూడిలోని ఎన్టీఆర్ సర్కిల్ లో కార్యకర్తలతో కలిసి ధర్నాకు దిగారు. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హెల్త్ యూనివర్సిటీ ఆలోచన చేసిందే ఎన్టీఆర్ అని, అలాంటిది ఆయన పేరు తొలగించడం దారుణమని అభిప్రాయపడ్డారు. పేరు మార్పు బిల్లును వెనక్కి తీసుకోకపోతే ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు. టీడీపీ ధర్నాతో ఆ ప్రాంత పరిసరాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. దాంతో పోలీసులు రంగంలోకి దిగి దేవినేని ఉమను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు, టీడీపీ శ్రేణులకు మధ్య వాగ్యుద్ధం, తోపులాట జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దేవినేని ఉమను భవానీపురం పీఎస్ కు తరలించి, ఇతర కార్యకర్తలను ఇబ్రహీంపట్నం వైపు తరలించారు.
Next Story