Mon Dec 23 2024 09:52:38 GMT+0000 (Coordinated Universal Time)
మా పోలీసులను పది నిమిషాలు వదలండి
అన్నమయ్య జిల్లాలో పోలీసులపై జరిగిన దాడిని పోలీసు అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది
అన్నమయ్య జిల్లాలో పోలీసులపై జరిగిన దాడిని పోలీసు అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. టీడీపీ కార్యకర్తల దాడుల్లో 13 మంది పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. పుంగనూరులో విధ్వంసాన్ని పోలీసులు అరికట్టారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు కావాలనే టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టారని.. పుంగనూరులో అనుమతి లేకుండగా టీడీపీ కార్యకర్తలు చొరబడ్డారన్నారు. పోలీసులను తీవ్రంగా గాయపరిచారని.. ఈ క్రమంలో పోలీసులు సంయమనం కోల్పోతే పుంగనూరులో పరిస్థితి మరోలా ఉండేదని అన్నారు. ఇది పోలీసుల చేతకానితనం అనుకుంటే పొరపాటేనని.. ఈ దాడిలో అమాయకులు, సామాన్య ప్రజలు ఇబ్బంది పడకూడదనే తాము సంయమనం పాటించామన్నారు.
ఒక్క 10 నిమిషాలు తాము మా ఉద్యోగాలను పక్కన పెట్టి ఉంటే అక్కడి వాళ్ల పరిస్థితి మరోలా ఉండేదని పోలీసు అధికారిణి నాగిని అన్నారు. మాకూ కుటుంబాలు ఉన్నాయి.. మాకూ ఆత్మాభిమానం ఉంటుందని చెప్పుకొచ్చారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా ఉద్యోగాలను చేస్తున్నామని.. ఆరోగ్యం సరిగా ఉన్నా, లేకున్నా ప్రజల కోసం విధుల్లో పాల్గొంటూ ఉన్నామని తెలిపారు. మా ఉద్యోగాలకు ఎవరూ అడ్డు రాకండని కోరారు. పోలీసులు బలయ్యారు కాబట్టి సరిపోయింది.. అదే పబ్లిక్ కు ఏదైనా జరిగి ఉండి ఉంటే మమ్మల్ని ఎన్నేసి మాటలు అని ఉండేవారోనని కన్నీళ్లు పెట్టుకున్నారు నాగిని. పుంగనూరు ఘటనపై విచారణకు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశించారు. డీఐజీ అమ్మిరెడ్డి, ఎస్పీ రిషాంత్లకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. టీడీపీ కార్యకర్తల దాడిలో పోలీసులు గాయపడ్డారని, వాహనాలను సైతం ఉద్దేశపూర్వకంగా తగులపెట్టారని డీజీపీ అన్నారు.
Next Story