Tue Nov 05 2024 13:49:44 GMT+0000 (Coordinated Universal Time)
టీడీపీ మహానాడు : ఏపీ డీజీపీకి అచ్చెన్నాయుడు లేఖ
రాజమండ్రిలో జరిగే టీడీపీ మహానాడు కార్యక్రమానికి పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్దఎత్తున తరలివస్తారని..
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి లేఖ రాశారు. మే27,28 తేదీల్లో రాజమండ్రిలో జరిగే మహానాడుకు బందోబస్తు కల్పించాలని ఆయన లేఖలో విజ్ఞప్తి చేశారు. రాజమండ్రిలో జరిగే టీడీపీ మహానాడు కార్యక్రమానికి పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్దఎత్తున తరలివస్తారని, వారందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ ను క్రమబద్దీతరణ చేయాలని అచ్చెన్నాయుడు లేఖలో డీజీపీని కోరారు.
కాగా.. రాజమండ్రిలో జరగనున్న మహానాడు సక్సెస్ అవకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని టీడీపీ సీనియర్ నేత నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు. టీడీపీ కార్యకర్తలు మహానాడుకు రాకుండా అడ్డుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారని, మహానాడుకు వచ్చే బస్సులను సీజ్ చేస్తామని బెదిరిస్తున్నారని చినరాజప్ప మండిపడ్డారు. ఎన్ని ఎత్తులు వేసినా మహానాడును అడ్డుకోలేరని ఆయన స్పష్టం చేశారు.
తుళ్లూరులో ఉద్రిక్తం..
మరోవైపు తుళ్లూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నేడు ఆర్ -5కు వ్యతిరేకంగా గుంటూరుజిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ పిలుపునిచ్చారు. ఇదే సమయంలో ఆర్-5 జోన్ కు మద్దతుగా వైసీపీ శ్రేణులు బైక్ ర్యాలీకి పిలుపునిచ్చాయి. ఇరు పార్టీల నిరసన, ర్యాలీ నేపథ్యంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని పోలీసులు తుళ్లూరులో 144 సెక్షన్ అమలు చేశారు. దీక్షాశిబిరం వద్దకు చేరుకున్న రైతుల్ని, నాయకుల్ని అరెస్ట్ చేశారు. హైకోర్టు సీనియర్ న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ ను కూడా అరెస్ట్ చేయడంతో తుళ్లూరులో వాతావరణం హీటెక్కింది. దీక్షాశిబిరం వద్దకు రోజువారీ నిరసనలకు వచ్చినవారిని కూడా అరెస్ట్ చేస్తామని పోలీసులు హెచ్చరించారు.
Next Story