Mon Dec 23 2024 18:08:09 GMT+0000 (Coordinated Universal Time)
నారాయణ అరెస్ట్ పై అచ్చెన్న ఫైర్ : ఇది ప్రభుత్వం కుట్ర
నారాయణను ఎందుకు, ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో కూడా పోలీసులు చెప్పకపోవడం జగన్ రెడ్డి అప్రజాస్వామిక పాలనకు..
మంగళగిరి : మాజీ మంత్రి, టిడిపి నేత, నారాయణ విద్యాసంస్థల అధినేత పొంగూరు నారాయణ ను ఏపీ పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేసి.. ఏపీకి తరలించిన విషయం తెలిసిందే. పదవ తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో భాగంగానే నారాయణను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. నారాయణ అరెస్ట్ ను ఏపీ టిడిపి అధ్యక్షులు అచ్చెన్నాయుడు తీవ్రంగా ఖండించారు. జగన్ రెడ్డి అసమర్థ పాలన నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు కుట్ర పన్ని నారాయణను అక్రమంగా అరెస్ట్ చేయించారని అచ్చెన్నపత్రికా ప్రకటనలో ఆరోపించారు.
నారాయణను ఎందుకు, ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో కూడా పోలీసులు చెప్పకపోవడం జగన్ రెడ్డి అప్రజాస్వామిక పాలనకు అద్దం పడుతోందన్నారు. మూడేళ్ల పాలనలో జగన్ రెడ్డి ప్రజల సంక్షేమం కంటే.. కక్షసాధింపు చర్యలకే ప్రాధాన్యమిచ్చారని విమర్శించారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకూ టిడిపి నేతలను అక్రమ అరెస్టులు, అక్రమ నిర్బంధాలు చేశారని వాపోయారు. ప్రభుత్వ పాలనపై ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయించడం పరిపాటిగా మారిందన్నారు.
ప్రజలు ఓట్లు వేసి గెలిపించింది రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికే గాని.. ప్రతిపక్షాలపై కక్షసాధింపు చర్యలకోసం కాదని పేర్కొన్నారు. జగన్ రెడ్డి పాలనపై పెరుగుతున్న ప్రజల వ్యతిరేకతను దారిమళ్లించేందుకు.. ఈ తరహా డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నారని వైసీపీ ప్రభుత్వంపై అచ్చెన్న మండిపడ్డారు. 10వ తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ ఎక్కడా జరగలేదని స్వయంగా విద్యాశాఖమంత్రి బొత్ససత్యనారాయణ చెప్తుంటే.. మరోవైపు ఈ వ్యవహారంలో నారాయణను ఏ విధంగా అరెస్ట్ చేశారు ? అని అచ్చెన్న ప్రశ్నించారు. పరీక్షలను సజావుగా నిర్వహించడంలో విఫలమైన జగన్ ప్రభుత్వం.. ఆ నెపాన్ని నారాయణపై తోసే కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఈ కుట్రలకు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.
Next Story