గ్రూప్ -1 తుది ఫలితాలు.. మహిళా అభ్యర్థులదే పైచేయి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన గ్రూప్ -1 తుది ఫలితాల్లో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన గ్రూప్ -1 తుది ఫలితాల్లో టాప్-10 ర్యాంకుల్లో మహిళా అభ్యర్థులు పైచేయి సాధించారని ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ తెలిపారు. గురువారం గ్రూప్ -1 తుది ఫలితాలను విడుదల చేసిన ఆయన మాట్లాడుతూ.. గ్రూప్ -1 పోస్టులకు సంబంధించి 218 మంది అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించగా.. 110 మంది అభ్యర్థులు ఎంపికయ్యారని తెలిపారు. వీరిలో 59 మంది అబ్బాయిలు (53.6%) కాగా.. 51 మంది అమ్మాయిలు (46.4%) ఉన్నారని పేర్కొన్నారు. టాప్ -10 ర్యాంకుల్లో నలుగురు అబ్బాయిలు, ఆరుగురు అమ్మాయిలు ఉన్నట్లు వెల్లడించారు. స్ప్పోర్ట్స్ కోటాలో మిగిలి ఉన్న ఒక పోస్టు నియామకంపై త్వరలోనే ప్రకటన చేస్తామని గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు.
గ్రూప్ -1 లో టాప్-5 ర్యాంకర్లు వీరే :
గ్రూప్-1 తుది ఫలితాల్లో భానుశ్రీ లక్ష్మీ అన్నపూర్ణ ప్రత్యూష మొదటి ర్యాంకు సాధించగా.. భూమిరెడ్డి పావని రెండో ర్యాంకు, కంబాలకుంట లక్ష్మీ ప్రసన్న, ప్రవీణ్ కుమార్ రెడ్డి, భాను ప్రకాష్ రెడ్డిలు వరుసగా మూడు, నాలుగు, ఐదు ర్యాంకులు సాధించిన వారిలో ఉన్నారు.
రికార్టు టైంలో గ్రూప్-1 ఎంపిక ప్రక్రియ..
ఏపీపీఎస్సీ చరిత్రలో రికార్టు టైంలో కేవలం 11 నెలల వ్యవధిలో పూర్తి పారదర్శకంగా గ్రూప్-1 ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయగలగడం విశేషమని గౌతం సవాంగ్ పేర్కొన్నారు. మొదటిసారిగా సీసీటీవీ లైవ్ స్ట్రీమింగ్ తో పరీక్షలు నిర్వహించామన్నారు. కేవలం 19 రోజుల్లోనే ప్రిలిమ్స్ ఫలితాలను, 34 రోజుల్లోనే మెయిన్స్ పరీక్షా ఫలితాలు విడుదల చేశామన్నారు. 1:2 నిష్పత్తిలో ఇంటర్వ్యూలకు అభ్యర్థులను ఎంపిక చేశామన్నారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల్లో చాలావరకు ఐఐటీ, ఐఐఎం వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల నుంచి వచ్చినవారే ఉన్నారన్నారు. తప్పుడు సర్టిఫికెట్లతో మోసం చేయడానికి ప్రయత్నించిన ఒక అభ్యర్థిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే ఆ అభ్యర్థిపై క్రిమినల్ కేసు నమోదు చేయడం జరిగిందన్నారు.