Mon Dec 23 2024 07:06:51 GMT+0000 (Coordinated Universal Time)
ముండ్లపూడిలో చోళుల కాలపు శ్రీకృష్ణాలయం
తిరుపతి పరిసరాల్లో, తిరుచానూరు దగ్గరున్న ముండ్లపూడిలో చోళుల కాలం నాటి శిథిల కృష్ణాలయాన్ని పునరుద్ధరించి కాపాడుకోవాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డా. ఈమని శివనాగిరెడ్డి అన్నారు. తిరుపతికి చెందిన వారసత్వ కార్యకర్త బి.వి. రమణ ఇచ్చిన సమాచారం మేరకు ఆయన, ముండ్లపూడి కృష్ణాలయాన్ని బుధవారం నాడు సందర్శించారు
వెయ్యేళ్ల నాటి ముండ్లపూడి కృష్ణాలయాన్ని కాపాడుకోవాలి
తిరుపతి పరిసరాల్లో, తిరుచానూరు దగ్గరున్న ముండ్లపూడిలో చోళుల కాలం నాటి శిథిల కృష్ణాలయాన్ని పునరుద్ధరించి కాపాడుకోవాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డా. ఈమని శివనాగిరెడ్డి అన్నారు. తిరుపతికి చెందిన వారసత్వ కార్యకర్త బి.వి. రమణ ఇచ్చిన సమాచారం మేరకు ఆయన, ముండ్లపూడి కృష్ణాలయాన్ని బుధవారం నాడు సందర్శించారు. గర్భాలయం, అర్దమండపం, మహా మండపంలో ఉన్న ఈ ఆలయానికి కప్పుపైన శిఖరం లేదని, బయట గోడలు బీటలుబారి, అధిష్టానం భూమిలో కూరుకుపోయిందన్నారు.చక్కటి అధిష్టానం, కుంభపంజర స్తంభాలు, కోష్టాలు పై తోరణాలు, వాటిపై శిల్పాలతో ఉన్న పాదవర్గం కదిలిపోయాయని శివనాగిరెడ్డి చెప్పారు. ఆలయం అధిష్టాన పైన క్రీ. శ. 12వ శతాబ్దం నాటి విక్రమ చోలుని తమిళ శాసనం ఉందని చెప్పారు.
ముండ్లపూడి అసలు పేరు మునైపూండి, మునియపూండి అని, రాజరాజ నరేంద్రుని కాలంలో ఆయనకు గల బిరుదు పై ఆ గ్రామానికి శివపాదశేఖర నల్లూరనే పేరు కూడా ఉందని, ఈ గ్రామ ఆదాయంతో ఝోగి మల్లవరం లో ప్రస్తుత పరాచరేశ్వర స్వామిగా పిలవబడుతున్న తిప్పలాదీశ్వర ముడయ మహాదేవుని దీపానికి కావాల్సిన నూనెకు వినియోగం చేసేవారని స్థానిక విక్రమ చోళుని(క్రీ.శ. 1118-1185) శాసనంలో ఉందని ప్రముఖ చరిత్ర పరిశోధకుడు గోపీకృష్ణ తెలిపారని శివనాగిరెడ్డి చెప్పారు.
గర్భాలయంలో శ్రీకృష్ణుని విగ్రహం లేదని, కృష్ణుని పటాలకు పూజలు చేస్తున్నారని, ఆలయ ఎడమవైపు వేసిన సిమెంటు రోడ్డులో అధిష్టానం సగం మునిగిపోయిందని, ఈ ఆలయాన్ని పూర్తిగా ఊడదీసి, ఆధునిక పునాదులపై పునరుద్దించి కాపాడుకోవాలని శివ నాగిరెడ్డి, బి.వి.రమణ ముండ్లపూడి గ్రామస్తులకు, సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేశారు.
Next Story