ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు హ్మాపీయేనా..!
ఎన్నికలు సమీపిస్తున్న వేళ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఉద్యోగులను మచ్చిక చేసుకునే చర్యలు మొదలు పెట్టింది
ఎన్నికలు సమీపిస్తున్న వేళ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఉద్యోగులను మచ్చిక చేసుకునే చర్యలు మొదలు పెట్టింది. ఇప్పటికే కరువు భత్యం (డీఏ) విడుదల చేసిన జగన్ సర్కార్, ఈ నెల ఓ విడత పాత బకాయిలను కూడా విడుదల చేయనుంది. విద్యుత్ ఉద్యోగులతో చర్చలు జరిపి వాళ్లకు కొత్త వేతన సవరణ అమలు చేయడానికి సిద్ధమవుతోంది. దాదాపు ఐదువేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ నిర్ణయం తీసుకుంది. 2014 నాటికి ఐదేళ్లు నిండితేనే క్రమబద్ధీకరిస్తామని గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయంపై అప్పట్లో ప్రతిపక్షాల నుంచి, ప్రతిపక్ష మీడియా నుంచి పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. దీంతో రాష్ట్ర విభజన నాటికి కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తున్న వారందరినీ క్రమబద్దీకరిస్తూ బుధవారం ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు.
ఇక పాత పెన్షన్ లేని ఉద్యోగులందరికీ ప్రయోజనం కల్పిస్తూ ప్రభుత్వం మరో కీలక నిర్ణయాన్ని కార్యరూపంలోకి తీసుకువస్తోంది. పాత పెన్షన్‌ను పునరుద్ధరించడం సాధ్యం కాదని అర్థమైన సర్కార్, గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ (జీపీఎస్) ను తీసుకువస్తోంది. దీని ప్రకారం ఉద్యోగి పదవీ విరమణ చేసే నాటికి అతని మూల వేతనంలో సగం మొత్తాన్ని పెన్షన్ రూపంలో అందించనుంది. కొత్త పెన్షన్ పద్ధతి (సీపీఎస్) కింద ప్రతీనెలా ఉద్యోగి జీతంలో పది శాతం మినహాయించి, ప్రభుత్వం తరఫున మరో పదిశాతం కలిపి పెన్షన్ ఫండ్‌కి జమ చేస్తున్నారు. ఉద్యోగి పదవీ విరమణ చేసిన తర్వాత వచ్చే మొత్తం సొమ్ములో అరవై శాతం ఉద్యోగికి ఇచ్చి, నలభై శాతాన్ని స్టాక్ మార్కెట్లో పెట్టి, దానిలో వచ్చే వడ్డీని యాన్యుటీ కింద ఉద్యోగికి ప్రతీ నెలా ఇస్తారు, పాత పెన్షన్‌తో పోలిస్తే ఇది చాలా తక్కువ. అందుకే గ్యారంటీడ్ పెన్షన్ కింద ప్రభుత్వమే ఖజానా నుంచి సీపీఎస్ ఉద్యోగులకు పెన్షన్ ఇవ్వనుంది. అయితే ఈ పద్ధతి మీద ఉద్యోగులు అంత సంతృప్తిగా లేరు. పాత పెన్షన్ పునరుద్ధరణ అనేది జగన్ ఇచ్చిన ఎన్నికల హామీల్లో కీలకమైనది. తమకు పాత పెన్షన్‌ను యథాతధంగా పునరుద్ధరించాలని, జీపీఎస్‌కు అంగీకరించేది లేదని ఉద్యోగులు చెబుతున్నారు. సీపీఎస్ రద్దుపై తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎలాంటి హామీ ఇవ్వడం లేదు కాబట్టి, జగన్ సర్కార్ ప్రతిపాదనకు అంగీకరించడం వినా ఉద్యోగులకు గత్యంతరం లేదు.
ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఉద్యోగుల మధ్య సంబంధాలను బాగా దెబ్బతీసిన అంశం గత పీయార్సీ. అధికారంలోకి రాగానే 27 శాతం మధ్యంతర భృతి ఇచ్చిన జగన్ సర్కార్, వేతన సవరణ సమయానికి ఫిట్‌మెంట్‌ను 23 శాతానికి తగ్గించింది. ఇలా మధ్యంతర భృతి కంటే ఫిట్మెంట్ తగ్గడం ఇంతవరకూ జరగలేదు. ఈ విషయంపై ఉద్యోగులు ఆందోళన చేస్తుండగానే ఐదు డీఏలు కలిపి అందరికీ కొత్త వేతన సవరణను అమలు చేసి, జీతాలు పెరిగాయని లెక్కలు వేసి మరీ చూపించింది. ఈ విషయంపై ఉద్యోగులు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఆ సమయంలో ఇచ్చిన డీఏల పాత బకాయిలు కూడా ఇవ్వలేదు. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఉద్యోగుల ఆగ్రహాన్ని ఎంత మేర తగ్గిస్తాయో చూడాలి.