Fri Nov 22 2024 22:29:45 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : ఫ్యాన్ గుర్తు పై బటన్ నొక్కకపోతే చంద్రముఖి మళ్లీ లేస్తుంది... రక్తం తాగుతుంది
మరో చారిత్రాత్మక విజయాన్ని అందుకునేందుకు మీరు సిద్ధమా? అంటూ వైసీపీ అధినేత జగన్ ప్రశ్నించారు
మరో చారిత్రాత్మక విజయాన్ని అందుకునేందుకు మీరు సిద్ధమా? అంటూ వైసీపీ అధినేత జగన్ ప్రశ్నించారు. ఎల్లో వైరస్ మీద, కరోనా లాంటి దుష్ట చతుష్టయం మీద యుద్ధానికి సిద్ధమా? అని ప్రశ్నించారు. దెందులూరు సభలో వైఎస్ జగన్ ప్రసంగించారు. తోడేళ్ల వైపు నుంచి చూసినప్పుడు జగన్ ఒంటరివాడిగానే కనిపిస్తాడని, నిజమేమిటంటే... ఇదీ అసలు సీన్.. ఇక్కడ కనిపిస్తున్నది అసలు నిజమని అన్నారు. తాను ఏనాడూ ఒంటరిని కానని, వారి పొత్తులు వారికి ఉన్న సైన్యమయితే, తనకు ఉన్న తోడు, తన ధైర్యం, తన బలం మీరేనని చెప్పారు. నాయకుడి మీద నమ్మకం నుంచి పుట్టుకొచ్చిన సైన్యమని అన్నారు. రామయణం, మహాభారతంలో విలన్లు చంద్రబాబు అండ్ కో రూపంలో ఉన్నారని అన్నారు. తన ఆలోచనలన్నీ ప్రతి ఇంటికి వెళ్లి పంచుకోవాలని క్యాడర్ ను జగన్ కోరారు. దిగజారుడు పార్టీలన్నీ జగన్ నే టార్గెట్ చేస్తున్నాయన్నారు.
చంద్రబాబు ఏం చేశారో అడగండి...
1995లో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో తాను ఇచ్చిన హామీలను ఏనాడైనా పది శాతం అయినా అమలు చేశాడా? అని ప్రశ్నించాలన్నారు. ఆయన మీ కోసం ఏం చేశారని అడగమన్నారు. మూడు సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు ప్రజలకు ఏం చేశారో చెప్పగలరా? అని ప్రశ్నించారు. పెత్తందారులు ఎవరిపైనా దాడులు చేస్తున్నారో ప్రశ్నించమని కోరారు. చంద్రబాబు తన పథ్నాలుగేళ్ల పాలనలో ఏ రోజైనా ఒక్క రూపాయి మీ బ్యాంక్ అకౌంట్ లో వేశాడా? అని ప్రతి ఇంటికి వెళ్లి అడగాలన్నారు. గత యాభై ఆరు నెలల పాలనలో కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకూ జరిగిన అభివృద్ధి చూడమని చెప్పండంటూ క్యాడర్ కు పిలుపు నిచ్చారు. ప్రతి నెల ఒకటో తేదీన పింఛన్ ఇస్తున్నామని చెప్పారు. లంచాలు, వివక్ష లేని పారదర్శకతతో కూడిన పాలన తీసుకు వచ్చామని చెప్పారు. చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలను చీల్చి చెండాలాలని పిలుపు నిచ్చారు
వైసీపీ వచ్చిన తర్వాతనే...
వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి జరిగిందన్నారు. చంద్రబాబు, దత్తపుత్రుడు, ఇతర తోడేళ్లు ఏకమయ్యాయయని అన్నారు. టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలు లంచాలకు మారు పేరు అని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అన్ని రంగాల్లో చేయూతనిచ్చింది ఈ ప్రభుత్వ హయాంలోనేనని అన్నారు. రాజకీయంగా కూడా అనేక పదవులు ఇచ్చామని తెలిపారు. చంద్రబాబు ఏనాడూ పేదలను పట్టించుకోలేదన్నారు. రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే 80 శాతం బడుగు, బలహీన వర్గాల వారికే చెందాయని జగన్ తెలిపారు. ఏకంగా 31 లక్షల ఇళ్లపట్టాలు ఇచ్చి మహిళలకు సొంత ఇంటి కలలను సాకారం చేసే దిశగా ప్రయత్నం చేశామన్నారు నామినేషన్ ఇచ్చే కాంట్రాక్టుల్లోనూ యాభై శాతం ఇచ్చామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలను ప్రయివేటు స్కూళ్లకు పోటీగా తీర్చిదిద్దామని చెప్పారు. ఈ మధ్య చంద్రబాబుకు ఎన్టీఆర్ గుర్తుకు వస్తున్నారని అన్నారు. టీడీపీ పిలుస్తుంది రా కదలిరా అని పిలుస్తున్నాడని, ప్రజలను కాదని పార్టీలను పిలుస్తున్నాడని, తానిచ్చే ప్యాకేజీల కోసం రాకదలిరా అంటూ పిలుస్తున్నాడన్నారు.
రా కదలిరా అంటూ...
ఇంత సంక్షేమం, అభివృద్ధి కంటికి కనిపిస్తున్నా అబద్దాల పునాదుల మీద ఎన్నికల ప్రచారాన్ని వాళ్లు మొదలు పెట్టారన్నారు. అందరూ పోలింగ్ కేంద్రాలకు వచ్చి జగనన్నకు ఓటు వేయాలని ఇంటింటికి తిరిగి చెప్పాలన్నారు. మళ్లీ జగన్ ప్రభుత్వం రావాలంటే ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని అన్నారు. ప్రతి అక్క చెల్లెమ్మ వంద మందికి చెప్పి ఓటు వేయించాలని కోరారు. 57 నెలల కాలంలో 184 సార్లు బటన్ నొక్కి రెండున్నర లక్షల కోట్లను లబ్దిదారుల ఖాతాల్లో వేశామని చెప్పారు. జగనన్న కోసం ఒక్కసారి మనం బటన్ నొక్కలేమా? అని ప్రతి ఇంటికి తిరిగి చెప్పాలని అన్నారు. ఒకటి అసెంబ్లీకి, ఒకటి పార్లమెంటుకు బటన్ ఫ్యాన్ నొక్కితే గత ఎన్నికల్లో బటన్ నొక్కి పెట్టెలో బంధించిన చంద్రముఖి బెడద ఇక శాశ్వతంగా ఉండదన్నారు. లేదంటే చంద్రముఖి లకలక అంటూ సైకిలెక్కి టీ గ్లాస పట్టుకుని రక్తం తాగుతుందని జగన్ అన్నారు. ప్రజలే తమ పార్టీకి స్టార్ క్యాంపెయినర్లుగా మారాలని అన్నారు. ప్రతిపక్షాలకు ఓటు వేస్తే ఈ స్కీముల రద్దుకు మనమే ఓటు వేసినట్లవుతుందని చెప్పాలన్నారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టిన పార్టీని, ఆయన పేరును ఛార్జిషీటులో పెట్టిన పార్టీని రా కదలిరా అంటూ చంద్రబాబు పిలుస్తున్నాడన్నారు. వాళ్లంతా నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ అంటూ షర్మిలతో సహా అందరిపై విరుచుకుపడ్డారు. సైకిల్ ను తొక్కడానికి ఇద్దరిని, తోయడానికి మరో ఇద్దరిని రా కదలిరా అని పిలుస్తున్నాడన్నారు.
Next Story