Mon Dec 23 2024 05:17:21 GMT+0000 (Coordinated Universal Time)
విధి ఆడిన వింతనాటకంలో ఓడిన దంపతులు.. నీవెంటే నేనంటూ..
ఆస్పత్రిలో ఉన్న భార్యను చూసి తట్టుకోలేకపోయాడు. కోలుకుని తిరిగి వస్తుందనుకున్న మౌనిక.. ఆరోగ్యం విషమించడంతో..
వాళ్లిద్దరితో విధి ఓ నాటకం ఆడింది. విధి రాసిన కథలో వారిద్దరూ ఓడిపోయారు కానీ.. దంపతులుగా గెలిచారు. పెళ్లినాడు చేసుకున్న ప్రమాణాలను గాలికొదిలేసి.. నువ్వెంత అంటే నువ్వెంతంటూ తగాదాలు పడే భార్యభర్తలున్న ఈ రోజుల్లో.. నువ్వులేక నేను లేను.. నీవెంటే నేనూ ఉంటాను అనేంతలా ఆ దంపతులు అన్యోన్యంగా ఉన్నారు. వారి అన్యోన్యతను చూడలేని విధి మృత్యువు రూపంలో కాటేసింది. ఫలితంగా కన్నవారికి తీరని కడుపుశోకాన్ని మిగిల్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ లోని ఆముదాలవలస మండలం ఈసర్లపేట గ్రామానికి చెందిన మంగరాజు రాజబాబు (27) 2016లో ఇండియన్ ఆర్మీలో చేరాడు. 2022 ఫిబ్రవరిలో అదే గ్రామానికి చెందిన మౌనికతో వివాహం జరిగింది. ప్రస్తుతం రాజబాబు హరియాణాలో విధులు నిర్వర్తిస్తున్నాడు. భార్య మౌనిక ఏడునెలల గర్భిణి. ఆమెకు ఇటీవల అనారోగ్యంగా ఉండటంతో కుటుంబ సభ్యులు విశాఖపట్నంలోని ఆర్మీ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ విషయాన్ని తండ్రి సత్యనారాయణ చెప్పడంతోనే.. రాజబాబు ఆగమేఘాలమీద విశాఖకు చేరుకున్నాడు.
ఆస్పత్రిలో ఉన్న భార్యను చూసి తట్టుకోలేకపోయాడు. కోలుకుని తిరిగి వస్తుందనుకున్న మౌనిక.. ఆరోగ్యం విషమించడంతో ఏప్రిల్ 16న కడుపులో బిడ్డతో సహా కన్నుమూసింది. భార్యతో పాటు కడుపులోనే బిడ్డ కూడా చనిపోవడంతో రాజబాబు తీవ్రమనస్తాపానికి గురయ్యాడు. భార్య ఇక లేదు.. తిరిగి రాదన్న నిజాన్ని తట్టుకోలేకపోయాడు. భోజనం చేయడం మానేయడంతో.. రాజబాబుకు అనారోగ్యం చేసింది. ఈనెల 19న ఆస్పత్రికి వెళ్లొస్తానని ఇంట్లో చెప్పి బయల్దేరి.. ఆముదాలవలస నుంచి రైలులో పొందూరుకి వెళ్లాడు.
తాను పొందూరులో ఉన్నానని, అక్కడే చనిపోతున్నాననంటూ స్నేహితులకు మెసేజ్ చేయడంతో.. వాళ్లు ఆందోళన చెంది పొందూరు పోలీస్ స్టేషన్ కు సమాచారమిచ్చారు. బుధవారం 7.45 గంటల సమయంలో పొందూరులోని రైలు పట్టాలపై వెతికారు. ఎక్కడా ఎలాంటి ఆచూకీ తెలియలేదు. ఉదయం 11 గంటల సమయంలో కొంచాడ సమీపంలోని తోటలో ఓ యువకుడు మృతి చెందినట్లు సమాచారం అందగా.. అక్కడికి వెళ్లి చూశారు. ఆ తోటలో ఓ చెట్టుకు రాజబాబు ఉరికి వేలాడుతూ విగతజీవిగా కనిపించాడు. పెళ్లైన ఏడాదికే.. కొడుకు, కోడలు మరణించడంతో.. ఆ తల్లిదండ్రులు గుండెలు అవిసేలా రోధించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story