Sat Dec 21 2024 16:49:23 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala Laddu Controversy : సిట్ విచారణకు నేడు బ్రేక్ పడిందా? సుప్రీం తీర్పు తర్వాతనేనా?
తిరుమల లడ్డూ వివాదం సుప్రీంకోర్టుకు చేరడంతో సిట్ దర్యాప్తు వేగం తగ్గించినట్లు కనపడుతుంది
తిరుమల లడ్డూ వివాదం సుప్రీంకోర్టుకు చేరడంతో సిట్ దర్యాప్తు వేగం తగ్గించినట్లు కనపడుతుంది. ఈ నెల 3వ తేదీన జరగనున్న విచారణలో సిట్ తో దర్యాప్తు చేయించాలా? లేక స్వతంత్ర సంస్థ చేత విచారణ చేయించాలా? అన్న దానిపై సుప్రీంకోర్టు తేల్చనుండటంతో తిరుమలలో గత నాలుగు రోజులుగా విచారిస్తున్న సిట్ బృందం కొద్దిగా విచారణకు బ్రేకులు పడినట్లు కనిపిస్తుంది. సుప్రీంకోర్టు నిర్ణయంతో విచారణ జరపాలా? వద్దా? అన్న దానిపై నేడు ఉన్నతాధికారులతో చర్చించనున్నారు. సర్వశ్రేష్ట త్రిపాఠీ నేతృత్వంలోని సిట్ బృందం గత మూడు రోజుల నుంచి తిరుమల లడ్డూ వివాదంపై దర్యాప్తు జరుపుతుంది.
తీర్పు తర్వాతనేనా?
టీటీడీ ఈవో శ్యామలరావును విచారించింది. పోటు వద్దకు వెళ్లి అక్కడ లడ్డూ తయారీ దారులతో కూడా మాట్లాడింది. రెండు బృందాలుగా విడిపోయి దర్యాప్తు చేస్తున్న సిట్ బృందం నేడు తిరుమలకు వచ్చిన డీజీపీ ద్వారకా తిరుమలరావుతో సమావేశం కానుంది. ఇప్పటి వరకూ తాము సేకరించిన సమాచారాన్ని డీజీపీ ముందు ఉంచనున్నట్లు తెలిసింది. అయితే సుప్రీంకోర్టు తీర్పు ఈ నెల 3వ తేదీన రానుండటంతో అప్పటి వరకూ ఆగాలా? లేక విచారణను కొనసాగించాలా? అన్న దానిపై నేడు అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు. డీజీపీ ఆదేశాల మేరకే సిట్ విచారణలో ముందుకు సాగుతుందని అధికారిక వర్గాలు తెలిపాయి. 3వ తేదీ వరకూ వేచిచూడటం మంచిదని పలువురు అధికారులు సూచించినట్లు తెలిసింది.
అందరూ రుచి చూసిన వారే...
దేశ వ్యాప్తంగా తిరుమల లడ్డూ వివాదం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే సుప్రీంకోర్టులో లడ్డూ తయారీలో కల్తీ నెయ్యిని వినియోగించినట్లు ఆధారాలను చూపలేకపోవడంతో ధర్మాసనం కూడా ఒకింత కామెంట్స్ చేసింది. ప్రభుత్వానికి ఒకరకంగా ఇది చెంపపెట్టు వంటిదే. ఎలాంటి ఆధారాలు లేకుండా, సెకండ్ ఒపీనియన్ తీసుకోకుండా, మైసూర్, గజియాబాద్ లోని ల్యాబ్ లకు పరీక్షలకు పంపకుండా లడ్డూలో కల్తీ నెయ్యి కలసిందని ఎలా ప్రకటిస్తారని నిలదీసినంత పనిచేసింది. తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నుంచి న్యాయమూర్తులందరూ ఏదో ఒక సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వారే. వాళ్లు కూడా లడ్డూ రుచి చూసిన వారే కావడంతో ఆధారాలు లేని ప్రకటనలు ఎందుకని ప్రశ్నించడంతో పాటు స్వతంత్ర దర్యాప్తు సంస్థకు విచారణకు ఆదేశించాలా? వద్దా అన్నది ఈ నెల 3వ తేదీన తీర్పు వెలువరించనుంది.
Next Story