Fri Nov 22 2024 22:17:51 GMT+0000 (Coordinated Universal Time)
అసని ఎఫెక్ట్.. మరో ఆరు రైళ్లు రద్దు !
అసని తుఫాను నేపథ్యంలో ఇప్పటికే పలు విమాన సర్వీసులు, రైళ్లు రద్దయ్యాయి. తాజాగా మరో ఆరు రైళ్లను రద్దు చేస్తున్నట్లు..
విశాఖపట్నం : ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుఫాను అనూహ్యంగా దిశను మార్చుకుంది. నిన్నటి వరకూ విశాఖ-కాకినాడ తీరాల వైపు వస్తుందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేశారు. కానీ.. వారి అంచనాలు తారుమారయ్యాయి. అసని తన దిశను మార్చుకుని మచిలీపట్నం వైపు పయనిస్తోంది. ప్రస్తుతం మచిలీపట్నానికి 60 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. వాయవ్య దిశగా పయనించి ఉదయం 11 గంటలకు ఏపీ తీరానికి సమీపంలోకి వచ్చి.. పశ్చిమమధ్య బంగాళాఖాతం చేరుకునే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ పేర్కొంది.
అసని తుఫాను నేపథ్యంలో ఇప్పటికే పలు విమాన సర్వీసులు, రైళ్లు రద్దయ్యాయి. తాజాగా మరో ఆరు రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. గుంటూరు-రేపల్లె (07784), రేపల్లె-గుంటూరు (07785), గుంటూరు-రేపల్లె (07786), రేపల్లె-తెనాలి (07873), కాకినాడ పోర్ట్-విశాఖపట్టణం (17267), విశాఖపట్టణం-కాకినాడ పోర్ట్ (17268) రైళ్ల రాకపోకలు తుఫాను కారణంగా రద్దయ్యాయి. గుంటూరు-డోన్ (17228) రైలును రీ షెడ్యూల్ చేశారు. మధ్యాహ్నం 1 గంటకు ఈ రైలు గుంటూరు నుంచి బయల్దేరాల్సి ఉండగా.. 3 గంటలకు రైలు బయల్దేరుతుందని అధికారులు తెలిపారు.
తుఫాను కారణంగా.. ఏపీలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. గాలుల ధాటికి చెట్లు విరిగిపడ్డాయి. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఉమ్మడి కోస్తాంధ్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 75 నుంచి 95 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
Next Story