Fri Apr 18 2025 02:38:16 GMT+0000 (Coordinated Universal Time)
Ashok Gajapathi Raju : రాజుగారి రాజకీయానికి ఎండ్ కార్డు పడినట్లేగా
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న సీనియర్ నేత అశోక్ గజపతి రాజు ఇక రాజకీయాల నుంచి తప్పుకున్నట్లే కనిపిస్తుంది

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న సీనియర్ నేత అశోక్ గజపతి రాజు ఇక రాజకీయాల నుంచి తప్పుకున్నట్లే కనిపిస్తుంది. ప్రస్తుతమున్న రాజకీయాల్లో తాను పనికి రానని ఆయన డిసైడ్ అయ్యారు. అందుకే తన వారసురాలిని పాలిటిక్స్ లోకి దించారు. అశోక్ గజపతి రాజు చంద్రబాబు నాయుడుతో సమానమైన రాజకీయ అనుభవం ఉన్న నేత. . విజయనగరం జిల్లా అంటేనే టీడీపీలో మొదట గుర్తొచ్చేది ఆయన పేరే. అలాంటిది అశోక్ గజపతి రాజు పేరు పూర్తిగా కనుమరుగైంది. ఆయన ఎక్కువ సమయం హైదరాబాద్ లోనే ఉంటున్నారని చెబుతున్నారు. తనకు ఎలాంటి పదవులు వచ్చే అవకాశం లేదని అశోక్ గజపతి రాజు దాదాపు ఫిక్స్ అయినట్లే కనపడుతుంది.
స్ట్రగుల్ అయినా...
ప్రస్తుతం అశోక్ గజపతి రాజును పార్టీ కూడా పట్టించుకోకపోవడం లేదు. ఆయన పేరు కూడా ఎక్కడా నేతల నోటి నుంచి ప్రస్తావనకు రావడం లేదు. ఆయన ఊసే లేదు. రాజ్యసభకు పంపుతారని అనుకున్నా ఆ పేరు కూడా పరిశీలనలోకి తీసుకోవడం లేదు. అశోక్ గజపతి రాజు శకం రాజకీయంగా ముగిసినట్లేనన్నఆయన అభిమానులు భావిస్తున్నారు. 2019 ఎన్నికలలో ఓటమి తర్వాత అశోక్ గజపతి రాజులో కొంత నైరాశ్యం అలుముకుంది. దీంతో పాటు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ట్రస్ట్ విషయంలోనూ జోక్యం చేసుకుంది. న్యాయస్థానాలకు వెళ్లి పోరాడాల్సి వచ్చింది. టీడీపీ ఆ సమయంలో కొంత వరకూ మద్దతుగా ఉన్నప్పటికీ ఎన్నికల తర్వాత మాత్రం ఆయన ఊసే వినిపించడంలేదు.
ఆమెకు అప్పగించి...
విజయనగరంలో మొన్నటి ఎన్నికల్లో తన కుమార్తె ఆదితి గజపతిరాజు గెలవడంతో భవిష్యత్ రాజకీయాలను ఆమెకే అశోక్ గజపతి రాజు అప్పగించినట్లు చెబుతున్నారు. వయసు కూడా మీద పడటంతో పాటు ప్రస్తుతం టీడీపీలో నెలకొన్న పరిస్థితులను బట్టి తమ మాట చెల్లుబాటు కాదని భావించిన అశోక్ గజపతి రాజు డిసైడ్ అయినట్లే కనిపిస్తుంది. అందుకే కూటమ ప్రభుత్వం ఏర్పాటయి పదినెలలు గడుస్తున్నా ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసే ప్రయత్నం కానీ, అమరావతికి కూడా రాలేదంటే ఆయన పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకున్నట్లే చెబుతున్నారు. అప్పుడప్పుడు తన కుమార్తె ఆదితి గజపతిరాజుకు సలహాలు ఇస్తూ కాలం గడుపుతున్నారంటున్నారు.
గవర్నర్ పదవి అంటూ...
పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు అశోక్ గజపతి రాజు పేరు ప్రముఖంగా వినిపించింది. ఆయనకు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి గవర్నర్ పదవి ఇస్తారన్న ప్రచారం కూడా బాగానే సాగింది. కానీ ఇప్పుడు గవర్నర్ పదవి కూడా దక్కే అవకాశం లేదంటున్నారు. భవిష్యత్ రాజకీయాలను దృష్టిలో ఉంచుకుని టీడీపీ నాయకత్వం నిర్ణయాలు తీసుకుంటుండటంతో సీనియర్ నేత అయిన అశోక్ గజపతి రాజును ఇక పట్టించుకునే సమయం, తీరిక పార్టీ నాయకత్వానికి ఉండకపోవచ్చు. ఆయన కూడా వచ్చి తనకు పదవి కావాలని కోరకపోవచ్చు. ఆయన రాజుగారు. తనకు పిలిచిపదవి ఇస్తే ఓకే గాని, అడిగి తెచ్చుకోవడం తన ఇంటా వంటా లేదంటున్నారు. మొత్తం మీద అశోక్ గజపతి రాజు రాజకీయ శకం ముగిసినట్లేనని అనుకోవాలి.
Next Story