Fri Nov 22 2024 16:53:49 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : శాసనసభ స్పీకర్ గా అయ్యన్న .. అభినందించిన సభ్యులు
ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయ్యన్నపాత్రుడును స్పీకర్ ఛెయిర్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి సత్యకుమార్ లు కలసి ఆయనను గౌరవంగా ఛెయిర్ వద్దకు తీసుకెళ్లి ఆసీనులను చేశారు. అయ్యన్న ఏకగ్రీవంగా ఎన్నికవడం సంతోషకరమైన విషయమని చంద్రబాబు అన్నారు. అత్యంత సీనియర్ సభ్యుల్లో ఒకరు అయ్యన్న పాత్రుడని అన్నారు. తెలుగుదేశం పార్టీలో తొలి నుంచి నమ్మకమైన నేతగా కొనసాగుతున్నారన్నారు. ఆయన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో పదవులు అలంకరించారన్నారు. పదవులకే వన్నె తెచ్చారని అన్నారు.
23 కేసులు నమోదు చేసి...
విశాఖపట్నం అంటే అయ్యన్న పాత్రుడికి ఎనలేని ప్రేమ అని అన్నారు. గత ఐదేళ్లలో అయ్యన్న పాత్రుడు ఎన్నో కష్టాలు పడ్డారన్నారు. చివరకు అరవై అయిదేళ్ల వయసులో అత్యాచారం కేసు కూడా ఆయనపై నమోదయిందన్నారు. మొత్తం 23 కేసులు నమోదయ్యాయని, అయినా ఎక్కడా చలించకుండా ఆయన ధైర్యసాహసాలను ప్రదర్శించారని చంద్రబాబు అన్నారు. గత ప్రభుత్వం ఎన్నో విధ్వంస కార్యక్రమాలు చేశారన్నారు. గత శాసనసభలో అధికార పార్టీ చేసిన వికృత చేష్టలను చూసి ప్రజలు ఈసడించుకున్నారన్నారు. చివరకు తన కుటుంబ సభ్యులను కూడా కించపర్చే విధంగా మాట్లాడితే ఆనాడు శాసనసభలో శపథం చేసి ముఖ్యమంత్రిగానే ఈ సభకు వస్తాను తప్పించి సాధారణ సభ్యుడిగా రానని చెప్పి వెళ్లానని అన్నారు.
రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి...
సభలో బూతులు తిట్టడం, అసభ్యంగా ప్రవర్తించడం నాడు జరిగిందన్నారు. నాడు తట్టుకోలేక జీవితంలో మొదటి సారి కంటతడి పెట్టానని చంద్రబాబు అన్నారు. అందుకే ప్రజలు ఇలాంటి తీర్పు ఇచ్చారన్నారు. 2021 నవంబరు 19 తర్వాత ఈరోజు గౌరవ సభలో అడుగుపెట్టానని తెలిపారు. తనకు జరిగిన అవమానాన్ని మరెవ్వరికీ జరగకుండా కాపాడే బాధ్యత ఈ సభ తీసుకోవాలని కోరుతున్నానని అన్నారు. గత ఐదేళ్లలో అసెంబ్లీని కక్ష కార్పణ్యాలకు వేదికగా మార్చారన్నారు. ప్రజలు కూడా ఎన్నడూ లేని విధంగా తీర్పు ఇచ్చారని తెలిపారు. వారి రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత ఈ సభపై ఉందని చంద్రబాబు అన్నారు. రాష్ట్రాన్ని మళ్లీ గట్టెక్కించడానికి అనేక వ్యయప్రయాసలకు లోనుకావాల్సి వస్తుందన్నారు.
Next Story