Thu Nov 21 2024 20:46:51 GMT+0000 (Coordinated Universal Time)
Balineni : బాలినేని వైైసీపీని వదిలేసినట్లుందిగా...పార్టీ ఏమైపోతే నాకేమన్నట్లు వ్యవహరించడం అందుకేనా?
ప్రకాశం జిల్లాలో పార్టీకి నాయకత్వం వహిస్తున్న బాలినేని శ్రీనివాసులురెడ్డి పార్టీని పట్టించుకోవడం మానేశారు
ఒంగోలు జిల్లాలో వైసీపీ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. కాంగ్రెస్ నాటి నుంచి వైసీపీ వరకూ ఆ పార్టీకి నాయకత్వ సమస్య లేదు. క్యాడర్ పుష్కలంగా ఉంది. ఎందుకంటే ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గంలో అత్యధిక నియోజకవర్గాలు ఎప్పుడూ వైసీపీ ఖాతాలోనే పడేవి. ఎక్కువ రెడ్డి సామాజికవర్గం ఉండటంతో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు పార్టీకి కొంత అండగా ఉండటంతో మొన్నటి ఎన్నికల వరకూ వైసీపీకి తిరుగులేకుండా ఉంది. అయితే మొన్నటి ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం మీద షాకిచ్చినట్లుగానే ప్రకాశం జిల్లాలోనూ వైసీపీకి జనాలు షాక్ ఇచ్చారు. ఇక వైసీపీకి జిల్లా పెద్ద బాలినేని శ్రీనివాసరెడ్డి. అధికారంలో ఉన్నా లేకపోయినా బాలినేని ఒక్కడే ఒంటిచేత్తో పార్టీని నడిపించేవారు.
చేతులెత్తేసి పార్టీని...
కానీ మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి పూర్తిగా చేతులెత్తేశారు. ఒంగోలు ప్రాంతాన్ని పూర్తిగా పట్టించుకోకుండా ఆయన ఎక్కువగా హైదరాబాద్ కే పరిమితమయ్యారు. బాలినేని శ్రీనివాసరెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండేవారు కారన్న విమర్శలు వినిపించాయి. అయినా సరే బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు శాసనసభ నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అలా ఒంగోలు అంటే బాలినేని కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారు. ఒంగోలు నియోజకవర్గంలో ఆయనకు అనుచరగణం కూడా ఎక్కువే. పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మంత్రి పదవి దక్కే వారిలో బాలినేని ఒకరు.
వైసీపీ ఖాళీ కావడంతో...
కానీ తాజాగా ఒంగోలులో వైసీపీ ఖాళీ అయింది. ఒంగోలు కార్పొరేషన్ లో వైసీపీకి గట్టి దెబ్బ తగిలింది. పన్నెండు మంది కార్పొరేటర్లు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. నగర్ మేయర్ సుజాతతో పాటు పన్నెండు మంది కార్పొరేటర్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అంతకు ముందు ఎనిమిది మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ లో చేరారు. దీంతో ఒంగోలు కార్పొరేషన్ వైసీపీకి చేజారి పోయింది. టీడీపీ పరమయింది. . గత కొన్నాళ్ల నుంచి దామచర్ల జనార్థన్ తో వైసీపీ కార్పొరేటర్లు చర్చలు జరుపుతున్నారు. ఈ విషయం బాలినేని శ్రీనివాసరెడ్డి శ్రీనివాసరెడ్డికి తెలుసు. కానీ వారిని నిలువరించే ప్రయత్నం ఆయన చేయకపోవడానికి కారణాలపై పార్టీ హైకమాండ్ కూడా ఆరా తీస్తుంది.
ఆడింది ఆట...
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండోసారి మంత్రివర్గ విస్తరణలో పదవి కోల్పోవడంతో బాలినేని శ్రీనివాసరెడ్డి అసంతృప్తితో ఉన్నారు. ఆయన ప్రతి దానికి హైకమాండ్ తో నేరుగా తలపడేవారు. వైఎస్ జగన్ కు బాలినేని శ్రీనివాసరెడ్డి దగ్గర బంధువు కావడంతో బాలినేని శ్రీనివాసరెడ్డి ఆడింది ఆట పాడింది పాటగా తయారైంది. కానీ ఓటమి తర్వాత కూడా నేతలను కూడా కనీసం దగ్గరకు తీసుకోకపోవడం, నిర్వేదంలోకి వెళ్లిపోవడం, ఒంగోలుకు దూరంగా ఉండటం వంటి కారణాలతో అక్కడ పార్టీకి ఇబ్బందులు తెచ్చిపెట్టాయంటున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి స్యయంకృతాపరాధంతోనే ఈ పరిస్థితికి తీసుకు వచ్చారంటున్నారు పార్టీ అగ్రనేతలు.
Next Story