Wed Dec 18 2024 22:15:22 GMT+0000 (Coordinated Universal Time)
బ్యూటీషియన్ కు రూ.45 లక్షలు టోకరా
అతని మాటలు నమ్మిన అనురాధ ఆ కంపెనీలో ఉన్నవారిని కలిసేందుకు వెళ్లింది. వారు లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే..
కష్టపడనిదే రూపాయి రాదు. ఊరికే వచ్చిన రూపాయి నిలబడదు. ఇది అందరికీ తెలిసిందే అయినా.. పెట్టుబడులతో అధిక లాభం వస్తుందంటే చాలు.. ముందు వెనుక ఆలోచించకుండా నమ్మి.. తర్వాత మోసపోయామని బోరున విలపిస్తారు. సరిగ్గా ఇలానే ఓ బ్యూటీషియన్ రూ.45 లక్షలు ముట్టజెప్పి మోసపోయింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే..
ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు నగరంలో చేపల మార్కెట్ వీధికి చెందిన అనురాధ కొంగారెడ్డి పల్లెలో బ్యూటీషియన్ గా పనిచేస్తుంది. కొద్దిరోజుల క్రితం ఆమె సమీప బంధువును కలవగా.. ఓ పెట్టుబడికి సంబంధించి చర్చలు జరిపారు. ఈ క్రమంలో బజారులో ఏఓజీ అనే కంపెనీ ఉందని, దానిలో పెట్టుబడి పెడితే భారీ లాభాలొస్తాయని ఆ బంధువు నమ్మించాడు. అతని మాటలు నమ్మిన అనురాధ ఆ కంపెనీలో ఉన్నవారిని కలిసేందుకు వెళ్లింది. వారు లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే వారానికి రూ.10 వేలు చొప్పున నెలకు రూ.40 వేలు .. ఏడాదికి రూ.4 లక్షల 80 వేలు ఇస్తామని నమ్మబలికారు. మూడేళ్ల తర్వాత పెట్టుబడి మొత్తాన్ని కూడా ఇచ్చేస్తామన్నారు. అయితే.. కంపెనీ రూల్ ప్రకారం తొలి మూడు నెలలకు వడ్డీరాదని, నాల్గవ నెల నుంచి వడ్డీ చెల్లిస్తామని చెప్పారు.
ఇంకేముంది తక్కువ పెట్టుబడి.. అధిక లాభం వస్తుందని అనురాధ ఊహల్లో విహరించింది. వాళ్లు చెప్పిందంతా గుడ్డిగా నమ్మిన ఆమె.. తన వద్దనున్న డబ్బు కాకుండా నగలు తాకట్టు పెట్టి, బంధువుల నుండి అప్పు తీసుకుని మరీ ఏకంగా రూ.45 లక్షలు ఆ ఏఓజీ కంపెనీ దారుల చేతుల్లో పెట్టింది. సీన్ కట్ చేస్తే.. మూడు నెలల తర్వాత వడ్డీ తీసుకుందామని ఆ కంపెనీకి వెళ్లిన అనురాధకు దిమ్మతిరిగే షాక్ తగిలింది. ఆ కంపెనీ బోర్డు తిప్పేసిందని తాను దారుణంగా మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించింది. అయితే ఆ కంపెనీలో అనురాధ మాత్రమే కాకుండా అనేకమంది పెట్టుబడి పెట్టి.. మోసపోయినట్టు తేలింది. కోట్లలో డిపాజిట్లు జరిగినట్లు వెల్లడైంది. అనురాధ ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు. దర్యాప్తు చేస్తున్నారు.
Next Story