Fri Nov 22 2024 14:59:01 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : నవీన్ తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం.. వైసీపీకి లాభం చేకూరుస్తుందా?
కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ లోక్సభలో మిత్రపక్షాలపై ఆధారపడి పని చేయాల్సి ఉంది
కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ లోక్సభలో మిత్రపక్షాలపై ఆధారపడి పని చేయాల్సి ఉంది. ప్రధానంగా లోక్సభలో టీడీపీ, జేడీయూల మద్దతుతోనే మోదీ ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇద్దరు సీనియర్ నేతలు... ఒకరు నలభై ఐదేళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు కాగా, మరొకరు సీనియర్ నేత బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ లు. ఇద్దరి చేతుల్లోనే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం భవితవ్యం ఆధారపడి ఉంది. ఇది లోక్సభలో పరిస్థితి. కానీ రాజ్యసభలో అయితే ఇందుకు సీన్ రివర్స్ లో ఉంది. అక్కడ వైసీపీ అవసరం బీజేపీ కేంద్రనాయకత్వానికి ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు.
పట్నాయక్ ఇచ్చిన షాక్ తో...
మొన్నటి వరకూ బిజూ జనతా దళ్ నేత నవీన్ పట్నాయక్ బీజేపీ ప్రభుత్వానికి సహకరించేవారు. బయట నుంచి మద్దతిచ్చేవారు. వైసీపీ తరహాలోనే బీజేడీ కూడా అన్ని బిల్లులకు రాజ్యసభలో మద్దతిస్తూ వస్తుంది. దీంతో మొన్నటి వరకూ ఇటు వైసీపీ, బీజేడీ వంటి పార్టీల మద్దతుతో రాజ్యసభలో అధికార బీజేపీ బిల్లులను ఆమోదించుకుంటూ వచ్చింది. ఎలాంటి ఇబ్బందులు పదేళ్ల పాటు ఎదురు కాలేదు. కానీ ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి, బిజూ జనతాదళ్ చీఫ్ నవీన్ పట్నాయక్ రివర్స్ అయ్యారు. రాజ్యసభలో ప్రజల పక్షాన పోరాడాలని తమ పార్టీ సభ్యులకు పిలుపు నిచ్చారు. బలమైన ప్రతిపక్ష పాత్ర పోషించాలని ఆయన సిద్ధమయ్యారు. రాజ్యసభలో బిజూ జనతా దళ్ కు 9 మంది సభ్యులున్నారు. ఇది పెద్ద సంఖ్య. నవీన్ పట్నాయక్ రివర్స్ నిర్ణయంతో ఇప్పుడు బీజేపీ చూపు వైసీపీపై పడిందని అంటున్నారు.
పదకొండు మంది సభ్యులున్న...
రాజ్యసభలో వైసీపీకి పదకొండు మంది సభ్యులున్నారు. 2026 వరకూ ఎవరూ పదవీ విరమణ చేసే పరిస్థితి లేదు. అదే సమయంలో ఎన్డీఏలో కూటమిగా ఉన్న తెలుగుదేశం పార్టీకి రాజ్యసభలో ఒక్క సభ్యుడు కూడా లేరు. దీంతో వైసీపీ పై ఆధారపడాల్సిన పరిస్థితి బీజేపీికి ఏర్పడింది. ఏమాత్రం కాదన్నా జగన్ అడ్డం తిరిగితే బిల్లులు ఆమోదం పొందడం అసాధ్యమవుతాయి. పెద్దల సభలో బీజేపీకి మెజారిటీ రావాలంటే ఇప్పట్లో సాధ్యం కాదు. అప్పటి వరకూ ఇతర పార్టీల మద్దతుతోనే బిల్లులను ఆమోదం పొందాల్సి ఉంటుంది. అంతే తప్ప వైసీపీని దూరం చూసుకునే పరిస్థితి లేదు. బిజూ జనతాదళ్ అంటే రాష్ట్రంలో అక్కడ బీజేపీ అధికారంలోకి రావడంతో పాటుగా, ప్రధాని నరేంద్ర మోదీ చేసిన విమర్శలతోనే నవీన్ పట్నాయక్ బీజేపీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.
మొన్నటి వరకూ వీళ్లే...
2024 వరకూ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని పార్టీలు బీజేపీకి మద్దతు ప్రకటించాల్సి వచ్చేవి. నాడు బీజేపీకి లోక్సభలో బలం ఉండటంతో పాటు కాంగ్రెస్ బలహీనంగా ఉందని భావించి అన్ని పార్టీలూ బీజేపీకి సలాం కొట్టాయి. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని పార్టీలతో సఖ్యతగా తాను ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. టీడీపీ, జనసేనలు ఎటూ తమ కూటమిలో సభ్యులుగా ఉన్నప్పటికీ వాటిని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. అలాగే జగన్ పార్టీ అవసరం రాజ్యసభలో ఉండటంతో వైసీపీని కూడా బీజేపీ నిర్లక్ష్యం చేయడం తగదు. ఇక బీజేపీ ముందు ఉన్న ఒకే ఆప్షన్ ఏంటంటే.. రాజ్యసభ సభ్యులను అవసరమైనంత మేరకు తన పార్టీలోకి లాగేసుకోవడం. అది ఎంతవరకూ సాధ్యమన్నది మాత్రం చెప్పలేని పరిస్థితుల్లో జగన్ ను మాత్రం కమలం పార్టీ వదులుకోలేని పరిస్థితులే ప్రస్తుతం నెలకొన్నాయన్నది వాస్తవం.
Next Story