Fri Nov 22 2024 10:35:54 GMT+0000 (Coordinated Universal Time)
అలాంటి వాడితో పొత్తా ? : బాబు పై సోము విమర్శలు
టీడీపీ-బీజేపీ-జనసేన కలిసి వస్తాయని కొందరంటుంటే.. జనసేన పొత్తు ఉండబోదని కొందరు, జనసేన- బీజేపీ పొత్తు..
అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న కొద్దీ ఏపీలో రాజకీయాలు మారుతున్నాయి. ఏ పార్టీ.. ఏ పార్టీతో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తుందో ? ఏ పార్టీ సింగిల్ గా వస్తుందో ఎవరికీ అంతుచిక్కడం లేదు. టీడీపీ-బీజేపీ-జనసేన కలిసి వస్తాయని కొందరంటుంటే.. జనసేన పొత్తు ఉండబోదని కొందరు, జనసేన- బీజేపీ పొత్తు ఉంటుందని మరికొందరి నుండి ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు.. చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. బీజేపీని అవమానించేలా మాట్లాడే వ్యక్తితో తమకు పొత్తు ఆలోచనే ఉండబోదని తెలిపారు.
ఆనాడు ప్రత్యేక హోదా వద్దన్న చంద్రబాబే.. ఇప్పుడు ప్రత్యేక హోదా కావాలంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రధానులను మార్చే శక్తి తనకు ఉందని, కేంద్రంలో చక్రం తిప్పానని చెప్పుకునే చంద్రబాబు.. రైల్వే జోన్ ఎందుకు తీసుకురాలేకపోయాడని ప్రశ్నించారు. బీజేపీ నోటాతో పోటీపడే పార్టీ అన్న బాబే.. ఇప్పుడు బీజేపీతో పొత్తు ఎలా పెట్టుకుంటాడని నిలదీశారు. సీబీఐని రాష్ట్రంలోకి రాకుండా నిషేధించిన చంద్రబాబుకి శాంతి భద్రతల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు సోము వీర్రాజు. చంద్రబాబు అధికారంలో ఉండగానే.. తిరుపతిలో అమిత్ షా పై దాడి జరిగినపుడు చర్యలు తీసుకున్నాడా ? అని ప్రశ్నించారు. బీజేపీపై తన వైఖరిని చంద్రబాబు మార్చుకోవాలని, లేదంటే పద్ధతిగా ఉండదని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
Next Story