Sun Dec 22 2024 23:24:15 GMT+0000 (Coordinated Universal Time)
BJP : చేతులెత్తేసిన చిన్నమ్మ.. ఏదైనా ఢిల్లీ వెళ్లండి అంటూ నేతలకు సలహా
ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఇప్పుడు ఏం చేయలేకపోతుంది. ఒకవైపు కేంద్రంలో టీడీపీ సహకారం అవసరం.
ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఇప్పుడు ఏం చేయలేకపోతుంది. ఒకవైపు కేంద్రంలో టీడీపీ సహకారం అవసరం. అలాగే ఏపీలో కూటమి మ్యానిఫేస్టోకు కూడా నాడు బీజేపీ నేతలు దూరంగానే ఉన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదన్న ఒత్తిడి తాము కూటమిలో ఉన్న పార్టీపై వత్తిడి తెచ్చే అవకాశమే లేదు. విమర్శలు చేసే సాహసం చేయరు. ఎందుకంటే ఇక్కడ ఏమాత్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా అక్కడ కేంద్ర ప్రభుత్వంపై ఎఫెక్ట్ పడుతుంది. పైగా కేంద్రంలో టీడీపీ, రాష్ట్రంలో బీజేపీ మంత్రివర్గంలో ఉన్నాయి. అందువల్ల ఇప్పుడు ఎటూ మాట్లాడలేని పరిస్థితి. పెద్దగా పదవుల కోసం డిమాండ్ చేయలేని స్థితిలో కమలం పార్టీ నేతలున్నారు.
శాసించే స్థాయి నుంచి...
వాస్తవానికి శాసించే స్థాయి నుంచి బీజేపీ నేతలు ఇప్పుడు యాచించే స్థాయికి వచ్చారు. చంద్రబాబుపై పదవుల కోసం వత్తిడి చేయలేరు. నామినేటెడ్ పదవులు భర్తీ విషయంలోనూ చంద్రబాబుదే ఫైనల్ డెసిషన్. కూటమి పార్టీ కాబట్టి ఒకటో, అరో పదవులు ఇచ్చేందుకు ఆయన మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఏపీ బీజేపీలో అనేక మంది పదవులపై ఆశలు పెట్టుకున్నారు. గత ఎన్నికల్లో టిక్కెట్ దక్కని వారు కూటమి అధికారంలోకి రావడంతో తమకు నామినేటెడ్ పదవులు వస్తాయన్న నమ్మకంతో ఉన్నారు. ఇప్పటికే పార్టీ అధ్యక్షురాలు పురంద్రీశ్వరి వద్ద తమ వినతులను కొందరు నేతలు పెట్టినట్లు సమాచారం.
కేంద్ర నాయకత్వం ....
అయితే నామినేటెడ్ పోస్టులను కూడా కేంద్ర నాయకత్వం సూచన మేరకే భర్తీ చేయడం జరుగుతుందని పురంద్రీశ్వరి వారికి నచ్చ చెబుతున్నట్లు తెలిసింది. మన చేతుల్లో ఏమీ లేదని, ప్రతిపాదనలు అయితే కేంద్ర నాయకత్వానికి పంపుతానని, చివరి నిర్ణయం అధినాయకత్వానిదేనని ఆమె కుండబద్దలు కొడుతున్నారని తెలిసింది. ఏదైనా పదవులు కావాలంటే కేంద్ర నాయకత్వాన్ని సంప్రదించాలంటూ చిన్నమ్మ చేతులెత్తేస్తున్నట్లు తెలిసింది. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యులుగా నియమించాలని కోరుతూ పెద్దయెత్తున దరఖాస్తులు రావడంతో పాటు కొన్ని ముఖ్యమైన పోస్టుల కోసం సిఫార్సు చేయాలని పురంద్రీశ్వరిపై వత్తిడి తెస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
టీడీపీ నేతలకే అధిక ప్రయారిటీ...
కానీ చంద్రబాబు నాయుడు మాత్రం తెలుగుదేశం పార్టీ నేతలకే ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలని డిసైడ్ చేసినట్లు తెలిసింది. పార్టీ కోసం ఏళ్లుగా కష్టపడిన వారు ఎమ్మెల్యే టిక్కెట్లను త్యాగాలు చేశారని, గత ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కృషి చేశారని, అటువంటి వారికే నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యత ఉంటుందని చెబుతున్నారట. అవసరమైతే జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ పెద్దలను కూడా ఒప్పించి టీడీపీ నేతలకు ఎక్కువ పదవులు ఇచ్చేందుకు ఆయన సిద్ధమయినట్లు తెలుస్తోంది. దీంతో బీజేపీ నేతల ఆశలు మాత్రం నామినేటెడ్ పోస్టుల విషయంలో నెరవేరేటట్లు కనిపించడం లేదు. అయినా వారు తమ ప్రయత్నాలను మాత్రం వదిలిపెట్టకుండా పదవుల కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Next Story