జగన్ పాలనలో అంతా అవినీతే: అమిత్ షా ఫైర్
వైసీపీ ప్రభుత్వంపై కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగన్ పాలనలో అవినీతి,
ఏపీ: వైసీపీ ప్రభుత్వంపై కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగన్ పాలనలో అవినీతి, కుంభకోణాలు తప్పితే మరేం లేదన్నారు. మోదీ ప్రధాని అయ్యాక మన దేశం పేరు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగుతోందన్నారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా మోదీ నినాదమే వినిపిస్తోందని అమిత్ షా అన్నారు. ప్రధాని మోదీ తొమ్మిదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిపై విశాఖ రైల్వే గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బీజేపీ బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగించారు. రైతుల సంక్షేమ ప్రభుత్వం అని సీఎం వైఎస్ జగన్ చెబుతున్న మాటల్లో ఎంత మాత్రం నిజం లేదన్నారు.
రైతుల ఆత్మహత్యల్లో ఏపీ మూడవ స్థానంలో ఉందన్నారు. రైతుల ఆత్మహత్యలపై వైసీపీ ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలని దుయ్యబట్టారు. రైతులకు కేంద్రం ఇచ్చే డబ్బును తామే ఇస్తున్నట్లు జగన్ చెబుతున్నారని అమిత్ షా ఆరోపించారు. ప్రధాని మోదీ ఉచితంగా ఇస్తున్న బియ్యంపైనా జగన్ ఫొటోలు ఎలా ఉంటాయని ప్రశ్నించారు. వైఎస్ జగన్ పాలనలో విశాఖ అరాచక శక్తులకు అడ్డాగా మారిందన్నారు. అధికార పార్టీ కనుసన్నల్లో భూ మాఫియా, మైనింగ్ మాఫియా చెలరేగిపోతోందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి పదేళ్లలో 5 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చామని తెలిపారు. అన్ని లక్షల కోట్ల అభివృద్ధి రాష్ట్రంలో కనిపిస్తుందా?, ఆ డబ్బు అంతా కూడా జగన్ ప్రభుత్వ అవినీతి ఖాతాల్లోకే వెళ్తోందన్నారు.
విశాఖ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు చేపట్టామని అమిత్ షా తెలిపారు. సికింద్రాబాద్ - విశాఖ, సికింద్రాబాద్ - తిరుపతి మధ్య వందేభారత్ రైళ్లను కూడా ప్రవేశపెట్టామన్నారు. భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని, విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి, అమరావతిలను స్మార్ట్ సిటీలుగా చేస్తున్నామని అమిత్ షా తెలిపారు. తొమ్మిదేళ్ల పాలనలో మోదీపై ఒక్క అవినీతి ఆరోపణ కూడా రాలేదన్నారు. మోదీ పాలనలో దేశం పూర్తి అంతర్గత రక్షణలో ఉందని అమిత్ షా అన్నారు. నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని కావడం ఖాయమని జోస్యం చెప్పారు. ఏపీ నుంచి బీజేపీ 20 లోక్సభ స్థానాలను గెలవాలన్నారు.