Sun Feb 16 2025 15:01:55 GMT+0000 (Coordinated Universal Time)
Vijaya Sai Reddy : విజయసాయిరెడ్డికి ఆ పదవి ఫిక్సయిందటగా..? రేపోమాపో ఉత్తర్వులు
వైసీపీకి రాజీనాామా చేసిన విజయసాయిరెడ్డికి బీజేపీ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలిసింది
![vijaya sai reddy, bumber offer, bjp, ap politics vijaya sai reddy, bumber offer, bjp, ap politics](https://www.telugupost.com/h-upload/2025/01/29/1685423-vijajaya-sai-reddy.webp)
వైసీపీ నుంచి విజయసాయిరెడ్డి బయటకు వచ్చారు. ఆయన రాజీనామా చేసి తాను వ్యవసాయం చేసుకుంటానని తెలిపారు. తనపై ఎవరి ఒత్తిళ్లు లేవని విజయసాయిరెడ్డి ప్రకటించారు. తాను ఏ పార్టీలో చేరేది లేదని కూడా విజయసాయిరెడ్డి ప్రకటించారు. మరో మూడేళ్లకు పైగానే పదవీ కాలం ఉన్నప్పటికీ విజయసాయిరెడ్డి పదవిని తృణప్రాయంగా త్యజించి వచ్చారంటే ఏదో ఉండి ఉంటుందని అందరూ అనుకునేదే. అందరి వేళ్లూ బీజేపీ వైపే చూపుతున్నాయి. ఎవరు అవున్నా కాదన్నా..బీజేపీ ఒత్తిడి మేరకే విజయసాయిరెడ్డి రాజీనామా చేశారన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొంత కాలం క్రితం అమిత్ షాను కలిసినప్పుడే ఈ నిర్ణయం వెలువడిందని చెబుతున్నారు.
భయపడే నేత కాకున్నా...
అయితే విజయసాయిరెడ్డి వైసీపీ అధినేత జగన్ తో చెప్పి మరీ రాజీనామా చేసి మరీ ఢిల్లీని వదిలి వచ్చారు. కేసుల నుంచి తప్పించుకోవడానికే అంటే ఆయనపై కేసులను తప్పించడం సాధ్యం కాదన్నది న్యాయనిపుణుల వాదన. విజయసాయిరెడ్డి కూడా తాను అప్రూవర్ గా మారేందుకు సిద్ధంగా లేరు. దీంతో ఆయన కేసులకు భయపడి బయటకు రాలేదన్నది కూడా అంతే నిజం. విజయసాయిరెడ్డి సాధారణంగా ఎవరికీ భయపడరు. ఆడిటర్ నుంచి పొలిటికల్ లీడర్ గా ఎదిగిన విజయసాయిరెడ్డి జగన్ కు తొలి నుంచి అండగా నిలుస్తూ వస్తున్నారు. జగన్ వెంట జైలుకు వెళ్లారు. ఆయనతో పాటే తన ప్రయాణం అంటూ అనేక సార్లు కుండబద్దలు కొట్టారు. అలాంటి విజయసాయిరెడ్డి కేవలం బెదిరింపులకు భయపడే నేత మాత్రం కాదు.
జగన్ బతిమాలినా...
వైఎస్ జగన్ కూడా విజయసాయిరెడ్డి రాజీనామాకు తొలుత ఆశ్చర్యపోయినా తేరుకుని ఆయన మనసు మార్చేందుకు ఎంతో ప్రయత్నించారు. లండన్ నుంచే ఆయనతో రాజీనామా వద్దంటూ వారించారు. కానీ విజయసాయిరెడ్డి మాత్రం జగన్ కు కూడా నచ్చ చెప్పి తన రాజ్యసభ పదవికి రాజీనామా చేసి పారేశారు. తాను రాజీనామా చేస్తే అది కూటమికి లాభమని ఆయనకు తెలుసు. అదే ఆయన కూడా చెప్పారు. అయితే అందుతున్న సమాచారం మేరకు తాను రాజీనామా చేసిన స్థానాన్ని టీడీపీ కాకుండా బీజేపీలో ఒక ప్రముఖ నేతకు ఇవ్వాలని నిర్ణయించడంతోనే ఆయన రాజీనామా చేసినట్లు ప్రధానంగా వైసీపీ చీఫ్ జగన్ కు కూడా సమాచారం అందినట్లు తెలిసింది.
రాజకీయాలకు దూరంగా ఉంటానని...
విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన సమయంలో తాను ఇక రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. అయితే ఏ పదవి తీసుకోనని మాత్రం చెప్పకపోవడంపైనే ఇప్పుడు అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. కానీ అందుతున్న సమాచారం మేరకు విజయసాయిరెడ్డికి గవర్నర్ పదవి ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమయిందని తెలిసింది. గవర్నర్ గిరీ అయితే రాజకీయాలతో సంబంధం లేకుండా హుందాగా ఉండవచ్చని, తనకు ఉన్న ఇబ్బందుల నుంచి కూడా తప్పించుకునే అవకాశముందని కూడా ఆయన భావిస్తున్నట్లు వైసీపీ నేతలు చెబుతున్నారు. విజయసాయిరెడ్డిని గవర్నర్ గా నియమిస్తూ త్వరలోనే ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశాలను కొట్టిపారేయలేమంటున్నారు.
Next Story