Fri Dec 20 2024 17:01:47 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan, KCR : కేసీఆర్ కు వాళ్లున్నారు.. జగన్ కు ఎవరున్నారు? ఒంటరి పోరాటం చేయాల్పిందేనా?
ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్, తెలంగాణలో కేసీఆర్ ఇద్దరూ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ప్రభుత్వాలు మారిపోయాయి. తెలంగాణలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న కేసీఆర్ 2023లో జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో వైఎస్ జగన్ ఐదేళ్ల పాటు పవర్ ను అనుభవించి ఓటమిని చవిచూశారు. ఇద్దరికీ సన్నిహిత సంబంధాలున్నాయి. ఏపీలో ఎన్నికలు జరిగిన తర్వాత కూడా జగన్ గెలుస్తారని అనేక సార్లు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారంటే జగన్ పై ఆయనకు ప్రత్యేక అభిమానం ఉందని అనుకోవాలి. ఇక జగన్ కూడా తన పార్టీ వైసీపీని తెలంగాణలో రద్దు చేసి కేసీఆర్ కు పరోక్షంగా సాయపడటానికేనని చెబుతారు. అయితే అది కాంగ్రెస్ కు ఉపయోగపడింది. అది వేరే విషయం అనుకోండి. ఇప్పుడు ఇద్దరూ ఓటమి పాలయి కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉంటే.. జగన్ బెంగళూరులోని తన ఓన్ హౌస్ లో ఉన్నారు.
ఇద్దరికీ పోలికలున్నా...
కానీ కేసీఆర్, జగన్‌లకు మధ్య కొన్ని పోలికలున్నాయి. ఇద్దరూ జనంలోకి పెద్దగా రారు. ప్రజలను కలవడానికి ఇష్టపడరు. ఇద్దరూ ఏకపక్ష నిర్ణయాలను తీసుకుంటారని అందరికీ తెలుసు. అంటే వారు చెప్పిందే వినాలి. అంతే తప్ప ఇతరుల సలహాలు ఏ మాత్రం పట్టించుకోరు. తాము అనుకున్నదే అమలు చేయడంలో ఇద్దరూ ఒకరికి మించిన వారు మరొకరు. అధికారంలో ఉండగా ఇద్దరూ ఎమ్మెల్యేలను కలవరు. మంత్రులకు అపాయింట్మెంట్ ఉండదు. ఇలా ఇద్దరి మధ్య పోలికలు అనేకం ఉన్నాయి. ఎన్నికల సమయంలోనూ ప్రజల మధ్యకు వస్తారన్న ఒక విమర్శ కూడా ఇద్దరిపైన ఉంది. కార్యాలయంలోనే ఉండి పాలన సాగిస్తుంటారు ఇద్దరూ. గత ఎన్నికల సందర్భంగా ఇద్దరూ రాజశ్యామల యాగం నిర్వహించినా అధికారానికి మాత్రం ఇద్దరూ దూరమయ్యారు.
ఇద్దరూ కలసి...
ఇక అభ్యర్థుల ఎంపికలో ఇద్దరిదీ వేర్వేరు పద్ధతులను అవలంబించారు. కేసీఆర్ సిట్టింగ్‌లు అందరికీ సీట్లు ఇచ్చి ఓటమి పాలయితే, జగన్ సీట్లు మార్చినా, కొత్త వారికి అవకాశం కల్పించినా పవర్ మాత్రం చేతికి రాలేదు. అయితే కేసీఆర్ కు ఒక సానుకూలత ఉంది. కేసీఆర్ ఓటమి తర్వాత బయటకు రాకపోయినా పెద్దగా ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఆయన కుమారుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మేనల్లుడు హరీశ్‌రావు తోడుగా నిలుస్తున్నారు. వీళ్లిద్దరూ పార్టీ పనులను చక్కదిద్దుతూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ కొంత క్యాడర్ జారిపోకుండా పార్టీని నిలబెడుతున్నారు. ఓటమి పాలయిన రోజు నుంచే కేటీఆర్, హరీశ్ రావులు జిల్లాల్లో పర్యటిస్తూ క్యాడర్ లో ధైర్యాన్ని నింపుతున్నారు. నేతలు పార్టీ నుంచి వెళ్లిపోతున్నా కొత్త నాయకత్వంతో ఈసారి అధికారం తమదేనన్న భరోసాను కల్పిస్తున్నారు.
ఆ స్థాయి నేత...
కానీ జగన్ కు ఆ ఆప్షన్ లేదు. జగన్ ఒక్కరే తిరగాలి. ఆయన కుటుంబ సభ్యులు గత ఎన్నికలకు ముందే రాజకీయంగా దూరంగా జరిగారు. తల్లి విజయమ్మ రాజకీయాలను పట్టించుకోవడం లేదు. చెల్లి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీకి చీఫ్ గా ఉన్నారు. జగన్ తర్వాత నెంబర్ 2 అనే వాళ్లు లేకపోవడంతో ఆయనే స్వయంగా వచ్చి పార్టీని నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఏపీలో వైసీపీ క్యాడర్ కొంత నిర్వేదంలో ఉంది. నిరాశలో కూరుకుపోయింది. అయితే ఈ సమయంలో జగన్ మాత్రమే జనంలోకి రావాల్సిన పరిస్థితుల్లో ఆయన వస్తేనే పార్టీ తిరిగి గాడిన పడుతుంది. పార్టీలో ఎవరూ అంతటి స్థాయి నేతలు లేకపోవడంతోనే ఈ సమస్య ఉంది. కేసీఆర్ కు ఉన్న అడ్వాంటేజీ జగన్ కు లేదనడానికి ప్రధానం కుటుంబమేనని వేరే చెప్పాల్సిన పనిలేదు. ఈ విషయంలో కేసీఆర్ కు కుటుంబ బలం ఉండగా, జగన్ మాత్రం ఒంటరి అని చెప్పక తప్పదు.
Next Story