Mon Dec 23 2024 19:09:49 GMT+0000 (Coordinated Universal Time)
నెల్లూరులో అమానుషం.. రుయా ఘటన రిపీట్
సంగంకు చెందిన ఇద్దరు చిన్నారులు బహిర్భూమికి వెళ్లి.. ప్రమాదవశాత్తు కనిగిరి జలాశయంలో పడిపోయారు. ఇద్దరిలో..
కనిగిరి : నెల్లూరు జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు జలాశయంలో పడి మృతి చెందిన చిన్నారిని ఇంటికి తీసుకెళ్లేందుకు అంబులెన్సులు గానీ.. ఆటోలు గానీ.. ఇతర వాహనాలు గానీ ముందుకు రాలేదు. పైగా మృతదేహాన్ని ఎవరు తీసుకెళ్తారని అనడంతో.. ఆ తండ్రి గుండెకు గుచ్చుకున్నాయి ఆ మాటలు. వేరే దారిలేక బైక్ పైనే చిన్నారి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లారు బంధువులు.
వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని సంగంకు చెందిన ఇద్దరు చిన్నారులు బహిర్భూమికి వెళ్లి.. ప్రమాదవశాత్తు కనిగిరి జలాశయంలో పడిపోయారు. ఇద్దరిలో శ్రీరామ్ (8) అనే చిన్నారిని బంధువులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. శ్రీరామ్ మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించడంతో.. మృతదేహాన్ని 108 వాహనం ద్వారా తరలించాలని అంబులెన్స్ సిబ్బందిని కోరారు బంధువులు. అందుకు నిబంధనలు ఒప్పుకోవని చెప్పడంతో.. ఏదైనా ప్రైవేటు వాహనం కోసం ఎదురుచూశారు.
అటుగా వెళ్తున్న ఆటోలు, ఇతర ప్రైవేటు వాహనాలు సైతం బాలుడి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు ముందుకురాలేదు. సమయానికి మహాప్రస్థానం వాహనం కూడా అందుబాటులో లేకపోవడంతో.. వేరేదారి లేక బాలుడి మృతదేహాన్ని బైక్ పైనే తీసుకెళ్లాల్సిన పరిస్థితి. ఈ ఘటన అక్కడి చూపరులచే కంటతడి పెట్టించింది. ఇటీవల రుయా ఆస్పత్రిలో వద్ద జరిగిన ఘటనను గుర్తుచేసింది. ఇక్కడ అంబులెన్స్ డ్రైవర్లు డబ్బులు అడగలేదు కానీ.. కాసింత మానవత్వం చూపిస్తే బాగుండేది.
Next Story