Mon Dec 23 2024 09:30:32 GMT+0000 (Coordinated Universal Time)
వివేకా హత్యను నిందితులు వీడియో తీసి పంపారు: బీటెక్ రవి
తాజాగా మరోసారి బీటెక్ రవి వివేకానందరెడ్డి హత్య గురించి స్పందించారు.
మాజీ ఎంపీ వివేకానందరెడ్డి హత్య విషయంలో ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చ జరుగుతూ ఉంది. 5 సంవత్సరాల తర్వాత కూడా న్యాయం జరగలేదని ఆయన కుమార్తె సునీత ఇటీవల మీడియా ముందుకు వచ్చారు. పలువురు వైసీపీ నేతలపై సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాకుండా వైసీపీకి ఓటు వేయొద్దని పిలుపును ఇచ్చారు. గతంలో పులివెందుల టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి కూడా వివేకానందరెడ్డి హత్య విషయంలో సంచలన ఆరోపణలు చేశారు. కొంతమంది నేతల హస్తముందంటూ వ్యాఖ్యలు చేశారు.
తాజాగా మరోసారి బీటెక్ రవి వివేకానందరెడ్డి హత్య గురించి స్పందించారు. వివేకా హత్యను నిందితులు వీడియో తీసి వైసీపీ పెద్దలకు పంపారన్న సమాచారం ఉందని బీటెక్ రవి సంచలన ఆరోపణలు చేశారు. వివేకా హత్యలో తన ప్రమేయం లేదని, తాను నార్కో అనాలిసిస్ టెస్టుకైనా సిద్ధమేనని అన్నారు. అవినాశ్ రెడ్డి కూడా అతడి ప్రమేయం ఏమీ లేదని నార్కో అనాలిసిస్ టెస్టుకు సిద్ధమా? అని బీటెక్ రవి సవాల్ విసిరారు. ఈ కేసును సీరియస్ గా తీసుకుంటే అవినాశ్ బీజేపీలోకి పోతాడని సునీతతో వైఎస్ జగన్ అన్నారని.. అది నిజం కాదా అని ప్రశ్నించారు. వివేకాను గొడ్డలితో చంపారన్న విషయం హత్య జరిగిన రోజునే జగన్ కు ఎలా తెలిసిందని ప్రశ్నించారు. ఈ కేసులో జగన్ ప్రమేయం ఉందన్న విషయం త్వరలోనే బయటికి వస్తుందని అన్నారు.
Next Story