Mon Dec 23 2024 03:12:41 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh Budget : ఉచిత బస్సు ఊసే లేదేమిటయ్యా.. పయ్యావులా?
ఆంధ్రప్రదేశ్ లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. బడ్జెట్ ను శాసనసభలో ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు
ఆంధ్రప్రదేశ్ లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. బడ్జెట్ ను శాసనసభలో ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. అయితే సూపర్ సిక్స్ హామీల గురించి ప్రస్తావన, బడ్జెట్ లో కేటాయింపులు లేకపోవడం ఒకింత నిరాశ కలిగించిందనే చెప్పాలి. ఈ ఏడాది 91,443 కోట్లు అప్పులు చేయాలని నిర్ణయించింది. అయితే సూపర్ సిక్స్ కు సంబంధించిన ప్రత్యేక పద్దులను ఈ బడ్జెట్ లో కేటాయింపులు జరపలేదు. ఇది రాజకీయంగా చర్చకు దారితీసింది. గత ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కారణమైన ఎన్నికల హామీల అమలుపై పయ్యావుల కేశవ్ ఎలాంటి ప్రకటన చేయలేదు.
నాలుగు నెలల బడ్జెట్ ...
అయితే నాలుగు నెలల బడ్జెట్ మాత్రమే కావడంతో బహుశ ఈ బడ్జెట్ లో సూపర్ సిక్స్ కు సంబంధించిన హామీలకు నిధుల కేటాయింపు జరపలేదని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. తల్లికి వందనం వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తామంటున్నారు. ఇంట్లో ఎందరు పిల్లలున్నప్పటికీ అందరికీ ఏడాదికి పదిహేను వేల రూపాయలు తల్లికి వందనం కింద చెల్లిస్తామని తెలిపారు. దీనికి ప్రత్యేకంగా నిధుల కేటాయింపులు జరపలేదు. అయితే ఉన్నత విద్యకు 2,326 కోట్ల రూపాయలు మాత్రమే ఈ బడ్జెట్ లో నిధులను కేటాయించారు. పాఠశాల విద్యకు 29,909 కోట్ల నిధులను కేటాయించారు. ఇందులో నుంచి తల్లికి వందనం కార్యక్రమానికి నిధులు కేటాయించే అవకాశముంది.
ఉచిత బస్సు పథకం...
ఇక మరో పథకమైన మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని పదే పదే చెబుతున్నారు. బహుశ సంక్రాంతికి ఈ పథకం ప్రారంభించే అవకాశాలున్నాయని చెబుతున్న నేపథ్యంలో రవాణా శాఖకు ఈ బడ్జెట్ లో రవాణా, రోడ్లు, భవనాలకు సంబంధించి 9,554 కోట్ల రూపాయల నిధులు కేటాయించారు. అయితే ఉచిత బస్సు పథకానికి నెలకు నాలుగు వందల కోట్ల రూపాయలకు పైగానే ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించాల్సి ఉంది. దీని గురించి ప్రత్యేకంగా పయ్యావుల కేశవ్ బడ్జెట్ లో ప్రస్తావించకపోవడం కూడా పొలిటికల్ గా హాట్ టాపిక్ గా మారింది. మరి త్వరలో ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.
నిరుద్యోగ భృతి...
ఇక నిరుద్యోగ భృతి నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి చెల్లించాలని ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు పర్చేందుకు కూటమి సర్కార్ బడ్జెట్ లో ముందుకు రాలేదన్న విమర్శలు వినపడుతున్నాయి. నిరుద్యోగ భృతి ఎప్పటి నుంచి ఇస్తారో కూడా ఇంత వరకూ కూటమి సర్కార్ చెప్పలేదని విపక్షాలు విమర్శలకు దిగాయి. అయితే నాలుగు నెలల కాలానికి సంబంధించిన బడ్జెట్ కావడంతోనే అన్ని హామీలను బడ్జెట్ లో పొందుపర్చలేక పోయామని అధికార పార్టీ తెలిపింది. ప్రజలు కూడా కూటమి సర్కార్ ప్రవేశపెట్టే బడ్జెట్ లో సూపర్ సిక్స్ కు సంబంధించిన హామీల ప్రస్తావన లేకపోవడం ఒకింత ఉసూరు కనిపించింది.
Next Story