Thu Dec 26 2024 08:28:18 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : మంత్రివర్గంలో లోకేష్ ముద్ర కనిపిస్తుందా? యువగళం ఎఫెక్ట్ బాగా పనిచేసిందా?
ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గం ఏర్పడింది. అయితే ఇందులో నారా లోకేష్ ముద్ర స్పష్టంగా కనిపిస్తుందంటున్నారు
తాజాగా ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గం ఏర్పడింది. అయితే ఇందులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ముద్ర స్పష్టంగా కనిపిస్తుందంటున్నారు. ఇరవై నాలుగు మంది మంత్రుల్లో పదిహేడు మంది కొత్త వారే కావడం ఇందుకు మరింత ఊతమిస్తుంది. మిత్ర పక్షాలు వారు సూచించిన వారికే టిక్కెట్లు ఇవ్వాల్సి ఉంటుంది. అది మిత్ర ధర్మం కూడా. కాకపోతే.. సొంత పార్టీ నేతలు అత్యధికంగా ఈసారి ఎన్నికయ్యారు. 134 మంది వరకూ టీడీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు. వీరిలో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు కొందరు కాగా, ఎక్కువ మంది సుదీర్ఘకాలం నుంచి పనిచేస్తున్న వారే. అందులోనూ చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన వారు గెలిచిన వాళ్లలో అనేక మంది ఉన్నారు.
పాతోళ్లలు కొందరే...
కానీ కేబినెట్ ను చూస్తే పాతోళ్లకు ఎవరికీ పెద్దగా మంత్రి పదవులు దక్కలేదు. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, పొంగూరు నారాయణ, ఎన్ఎండీ ఫరూక్, పయ్యావుల కేశవ్ వంటి వారు మాత్రమే ఉన్నారు. మిగిలిన వారంతా పార్టీలో సీనియర్లు అయినా మంత్రిపదవులకు కొత్తే. ప్రస్తుతం అప్పులు అధికంగా ఉన్నాయని చెబుతూ, రాష్ట్రాన్ని గట్టెక్కించాలని భావిస్తున్న తరుణంలో సీనియర్ నేతల అనుభవం ఎంతో అవసరమవుతుంది. కానీ చంద్రబాబు మాత్రం ఇవేమీ పట్టించుకోలేదు. కేవలం తాను అనుకున్న వారికే మంత్రి పదవులు కేటాయించారు. ఎందుకంటే భవిష్యత్ లో పార్టీని పరుగులు పెట్టించాలంటే యువత మంత్రి వర్గంలో ఉండాలని చంద్రబాబు భావించారని అంటున్నారు.
పాదయాత్రలో...
దీంతో పాటు లోకేష్ యువగళం పాదయాత్రలో బాగా పనిచేసిన, అలాగే కష్టపడి యాత్రను సక్సెస్ చేసిన వారికి కూడా మంత్రి పదవులు దక్కాయని అంటున్నారు. మంత్రివర్గ కూర్పులో లోకేష్ జోక్యాన్ని తప్పు పట్టలేం. ఎందుకంటే టీడీపీకి భవిష్యత్ నేత లోకేష్. అది అందరికీ తెలిసిన విషయమే. అందుకే చినబాబు నామస్మరణ అనేది ఎప్పటి నుంచో జరుగుతున్నదే. దానిని ఎవరూ తోసిపుచ్చలేరు కూడా. రానున్న కాలంలో చంద్రబాబు తర్వాత నెంబర్ టూ గా లోకేష్ మాత్రమే ఉండాలి. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ నెంబర్ 2గా లోకేష్ ఉండాలంటే సీనియర్ నేతలు ఎవరూ మంత్రివర్గంలో ఉండకూడదని భావించి ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చు. అచ్చెన్నాయుడు వంటి వారున్నప్పటికీ వాళ్లు పెద్దగా షైన్ కాలేరు. కానీ తమ వాగ్దాటితో, పనితీరుతో నెంబర్ 2 ఆక్రమించుకునే వారిని మాత్రం ఈ మంత్రివర్గంలో చోటు కల్పించకుండా పక్కనపెట్టారన్నది పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం.
అసంతృప్తికి నో ఛాన్స్....
ఇందులో మరే అవకాశాలు చంద్రబాబు ఇవ్వదలచుకున్నట్లే కనపడుతుంది. తనకు అత్యంత నమ్మకస్థులను కూడా పక్కన పెట్టానని చెప్పడానికి ప్రత్తిపాటి పుల్లారావు, పరిటాల సునీత, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి లాంటి వాళ్లనే పక్కన పెట్టి నేనింతే నని చంద్రబాబు నేతలకు బలంగా సంకేతాలను పంపగలిగారు. ఎవరో అనుకుంటారని, తలలు ఎగరేస్తారని మాత్రం ఆయన భయపడలేదు. గతంలో మాదిరి చంద్రబాబు ఈసారి మంత్రివర్గ కూర్పు చేయలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. అందుకే సమయం కోసం వేచి చూడటం తప్ప సీనియర్ నేతలు మరేం చేయలేేని పరిస్థితి. అసంతృప్తి కూడా వెళ్లగక్కలేని పరిస్థిితి. లెక్కలన్నీ చంద్రబాబుకు అనుకూలంగా ఉండటంతో ఇక చేసేదేమీ ఉండదు. చంద్రబాబు కనికరించి మంత్రి పదవి ఇస్తే తప్ప ఏం చేయలేని, పెదవి విప్పలేని పరిస్థిితి సీనియర్ నేతలది. చూడాలి మరి రానున్న రోజులలో ఏం జరుగుతుందో?
Next Story