Fri Nov 15 2024 11:43:58 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : వరస కేసులు.. తాజాగా ఇసుక కేసు కూడా నమోదు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చంద్రబాబుపై వరస కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఇసుక కుంభకోణంలో కేసు నమోదుయింది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చంద్రబాబుపై వరస కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో అరెస్టయి యాభై రెండు రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉండి మధ్యంతర బెయిల్ పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అనారోగ్య కారణాలతో ఆయనకు నాలుగు వారాల పాటు బెయిల్ లభించింది. దీంతో ఆయన ప్రస్తుతం హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎల్.వి. ప్రసాద్ కంటి ఆసుపత్రిలో ఆయనకు చికిత్స చేసేందుకు ఏర్పాట్లు చేశారు.
ఇప్పటికే అనేక కేసులు...
అయితే చంద్రబాబుపై ఇప్పటికే స్కిల్ డెవలెప్మెంట్ కేసు ఉండగానే ఫైబర్ నెట్ కేసు నమోదయింది. ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ కేసులో కూడా చంద్రబాబును నిందితుడిగా చేరుస్తూ సీఐడీ కేసు నమోదు చేసింది. ఆ తర్వాత మద్యం కేసులో చంద్రబాబు ఏ 3 నిందితుడిగా పేర్కొంటూ సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్రను కూడా నిందితుడిగా చేర్చింది. తాజాగా మరో కేసును కూడా సీఐడీ చంద్రబాబుపై నమోదు చేయడం విశేషం.
పదివేల కోట్ల నష్టం...
చంద్రబాబు పాలనలో ఇసుక అక్రమాలపై సీఐడీ విచారణ చేపట్టింది. దీనిపై కేసు నమోదు చేసింది. ఏపీఎండీసీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసింది ఈ కేసులో ఏ1 నిందితురాలుగా మాజీ మంత్రి పీతల సుజాత, ఏ2 నిందితుడుగా చంద్రబాబు, ఏ3 నిందితుడుగా చింతమనేని ప్రభాకర్, ఎ4 నిందితుడుగా దేవినేని ఉమామహేశ్వరరావుపై కేసు నమోదు చేసింది. చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాలతో పదివేల కోట్ల మేరకు ఇసుక దోపిడీ జరిగిందని సీఐడీ విచారణలో వెల్లడయిందని తెలిపింది. వీటన్నింటిలో చంద్రబాబు బెయిల్ తెచ్చుకోవాల్సి ఉంటుంది.
Next Story