Sun Dec 22 2024 14:36:12 GMT+0000 (Coordinated Universal Time)
కర్నూల్ లో హై టెన్షన్.. నేడు ఎంపీ అవినాశ్ అరెస్ట్ ?
సోమవారం వేకువజామునే సీబీఐ అధికారులు విశ్వభారతి ఆస్పత్రికి చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
కర్నూల్ లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. వివేకా హత్యకేసులో సీబీఐ విచారణకు హాజరు కావాల్సిన కడప ఎంపీ అవినాశ్ రెడ్డి.. నాలుగురోజులుగా హాజరు కాకుండా తప్పించుకుంటుండటంతో నేడు సీబీఐ అధికారులు అవినాశ్ రెడ్డి ఉన్న విశ్వభారతి ఆస్పత్రికి చేరుకున్నారు. నేడు సీబీఐ అధికారులు అవినాశ్ ను అరెస్ట్ చేస్తారని సమాచారం. ఈ మేరు జిల్లా ఎస్పీకి సీబీఐ అధికారులు సమాచారమిచ్చినట్లు తెలుస్తోంది.
నిన్న అవినాశ్ రెడ్డి సీబీఐ కు మరో లేఖ రాశారు. తన తల్లి ఆరోగ్యం బాగోలేదని, మరో 10 రోజులు సమయం కావాలని ఆ లేఖలో పేర్కొన్నారు. అవినాశ్ లేఖపై సీబీఐ స్పందించకుండానే.. సోమవారం వేకువజామునే సీబీఐ అధికారులు విశ్వభారతి ఆస్పత్రికి చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సీబీఐ అధికారులను అడ్డుకునేందుకు ఆస్పత్రి గేటు వద్ద వైసీపీ శ్రేణులు మోహరించారు. అధికారుల వాహనాలను అడ్డుకునేందుకు ఆటంకాలు సృష్టించారు. పోలీసులు వారందరినీ వెనక్కి పంపుతున్నారు. అంతకుముందు వెళ్లిన మీడియా ప్రతినిధులపై దాడి చేసి.. మరోసారి వస్తే చంపేస్తామంటూ వైసీపీ శ్రేణులు వార్నింగ్ ఇచ్చారు.
అవినాష్ తల్లి శ్రీలక్ష్మి అనారోగ్యానికి గురవ్వగా.. ఆమెను రెండ్రోజుల క్రితం కర్నూలు విశ్వభారతి ఆస్పత్రిలో చేర్పించారు. అదే రోజు సాయంత్రం ఎంపీ అవినాశ్ కూడా తనకు అస్వస్థతగా ఉందంటూ అదే ఆస్పత్రిలో చేరారు. అప్పటి నుండి సీబీఐ విచారణకు హాజరు కాలేనంటూ చెబుతూ వస్తుండటంతో.. నేడు నేరుగా సీబీఐ అధికారులే ఆస్పత్రికి చేరుకున్నారు.
Next Story