Thu Nov 21 2024 22:43:32 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : అమరావతికి ఇక మహర్దశ... కేంద్రం అంగీకారం
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం ప్రాధమికంగా ఆమోదం తెలిపింది
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం ప్రాధమికంగా ఆమోదం తెలిపింది. దీంతో అమరావతికి సులువుగా చేరుకునేందుకు జాతీయ రహదారి నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైదరాబాద్ నుంచి అమరావతికి ఆరు లైన్ల రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంతో ఇక ఏపీ రాజధాని ప్రాంతానికి సులువుగా తీసుకునే అవకాశం ఉంటుంది. కేంద్ర ఉపరితల రవాణా సంస్థ మంత్రిత్వ శాఖకు చెందిన స్థాయి సంఘంతో పాటు, ప్రధాని కార్యాలయం ఆమోదం పొందిన తర్వాత ఇవన్నీ ఇక ప్రారంభమవుతాయని చెబుతున్నారు.
ఓఆర్ఆర్ ప్రాజెక్టు...
అమరావతి ఓఆర్ఆర్ ప్రాజెక్టు కోసం భూసేకరణ తో పాటు మొత్తం ఇరవై నుంచి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వం భరించేందుకు అంగీకరించింది. దీంతో పాటు విజయవాడ తూర్పు బైపాస్ రోడ్డుకు ఆమోదం తెలిపింది. దీనివల్ల దాదాపు 70 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. ఇక రాయలసీమ నుంచి రాజధాని అమరావతికి కనెక్టివిటీని కూడా పెంచేలా జాతీయ రహదారిని నిర్మించనున్నారు. సత్యసాయి జిల్లాలోని కొడికొండ నుంచి మేదరమెట్ల కు కలుపుతూ తర్వాత అమరావతికి కొనసాగిస్తూ చేపట్టిన 90 కిలోమీటర్ల గ్రీన్ ఫీల్డ్ హైవేకు కూడా సానుకూలత కేంద్రం నుంచి లభించింది.
ఇవి పూర్తయితే...
ఈ నిర్మాణాలు పూర్తయితే రాజధాని అమరావతికి సులువుగా చేరుకునే వీలుంది. ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు ఈ ప్రాజెక్టులను సాధించడంలో సక్సెస్ అయ్యారంటున్నారు. ఎంత వేగిరం పూర్తయితే అంత వేగంగా చేయాలని కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయించింది. దీంతో అమరావతికి ఇక మహర్దశ పట్టనుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణపనులను అత్యంత వేగంగా చేపట్టేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తున్నట్లే కనపడుతుంది. కనెక్టివిటీ పెరిగితే రాజధానిలో మరిన్ని కంపెనీలు వచ్చే అవకాశముంటుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి.
Next Story