Mon Dec 30 2024 20:17:53 GMT+0000 (Coordinated Universal Time)
Arogyasri : ఆరోగ్య శ్రీని లేపేస్తారా? ప్రత్యామ్నాయ పథకం రెడీ అయిందా?
ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్య శ్రీ పథకాన్ని తీసివేయాలన్న యోచనలో చంద్రబాబు ప్రభుత్వం ఉంది
ఉమ్మడి రాష్ట్రంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన అద్భుతమైన పథకం ఆరోగ్య శ్రీ. ఈ పథకంతోనే వైఎస్ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించిన ఘనత వైఎస్ కే దక్కుతుంది. అనేక మంది గుండె శస్త్ర చికిత్సల నుంచి అనేక ఖరీదైన వైద్యాన్ని ఈ పథకం కింద ఉచితంగా పొంది దీర్ఘాయుష్యులుగా మారారు. అందుకే నేటికీ వైఎస్ అనగానే ముందుగా గుర్తొకొచ్చేపథకం ఆరోగ్య శ్రీ పథకం. అలాంటి ఆరోగ్య శ్రీ పథకం అమలు చేయడంపై ఏపీ ప్రభుత్వం పునరాలోచనలో పడిందని చెబుతున్నారు. దాని స్థానంలో మరొక ప్రత్యామ్నాయ విధానాన్ని తెచ్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం సమాలోచనలు చేస్తుంది.
ఈ పథకం ఎత్తివేయడానికి...
ఆరోగ్య శ్రీ పథకం ఎత్తి వేయడానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వమూ సాహసించలేదు. ఎందుకంటే దానికి అంతటి ప్రాముఖ్యత జనంలో ఉంది. దానిని ముట్టుకుంటే షాక్ తగులుతుందని తెలిసినా కూటమి ప్రభుత్వం మాత్రం ఈ పథకం అమలును కొనసాగించాలా? వద్దా? అన్న దానిపై ఆలోచనలో ఉందని సమాచారం. ఇందుకు ప్రత్యామ్నాయంగా బీమా విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు తెలిసింది. నిన్న చంద్రబాబు అధ్యక్షతన జరిగిన వైద్య ఆరోగ్య సమీక్ష సమావేశంలో దీనిపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రభుత్వ ఖజానాకు భారంగా మారిన ఈ పథకాన్ని వదిలించుకుని బీమా కంపెనీలకు అప్పగించే దానిపై ఆలోచనలు చేస్తున్నారు. నిజంగా ఇది కార్యరూపం దాలిస్తే చాలా మంది నష్టపోతారంటున్నారు.
బీమా కంపెనీలకు...
ఏపీని రెండు సెక్టార్లుగా విభజించి ఈ పథకాన్ని అమలు చేయాలని దాదాపుగా నిర్ణయించినట్లు చెబుతున్నారు. నిజానికి గత వైసీపీ ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పథకం పరిమితిని 25 లక్షల వరకూ పెంచింది. ఇతర రాష్ట్రాల్లో వైద్య సేవలను పొందేందుకుకూడా అనుమతులు ఇచ్చింది. అనేక రకాల రోగాల సంఖ్యను కూడా ఈ పథకం కిందకు తీసుకురావడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ పథకానికి అర్హులుగా నిర్ణయించారు. కానీ బీమా కంపెనీలకు ఈ పథకం అప్పగిస్తే అవి రోగులకు ఏ మేరకు ఉపయోగపడతాయన్న సందేహాలు అలుముకున్నాయి. బీమా కంపెనీ నుంచి ఓకే అయితేనే నిధులు మంజూరు అవుతాయి. అప్పుడే వైద్య సేవలు అందుతాయని వైద్యులు చెబుతున్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా 1.43 కోట్ల కుటుంబాలకు చెందిన 4.30 కోట్లమందికి ఉచిత వైద్య సేవలు అందుతున్నాయి. ఎన్టీఆర్ వైద్య సేవలో 3,257 రకాల జబ్బులకు ఉచితంగా వైద్యం అందిస్తున్నారు.
మరింత నాణ్యమైన వైద్య సేవలు...
ఏడాదికి ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల మేర హెల్త్ కవరేజ్ ఉంటుంది. ట్రస్ట్ పద్దతిలో ప్రస్తుతం ఎన్టీఆర్ వైద్య సేవ కార్యక్రమం నిర్వహిస్తుండగా....ఈ కార్యక్రమాన్ని బీమా విధానంలో తీసుకొచ్చే అంశంపై చర్చించారని తెలిసింది. ఆరోగ్య బీమా విధానం వల్ల మరింత మెరుగ్గా, నాణ్యమైన సేవలు అందించే అవకాశం ఉంటుందని అధికారులు వివరించగా చంద్రబాబు దానికి సూత్ర ప్రాయంగా అంగీకరించారని తెలిసింది. ఏపీని రెండు యూనిట్లుగా విభజించి బీమా విధానాన్ని ప్రారంభించే అవకాశాన్ని పరిశీలించనున్నారు. పబ్లిక్ సెక్టార్, ప్రైవేటు సెక్టార్లో ఉన్న బీమా కంపెనీల ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిసింది. మొత్తం మీద చంద్రబాబు సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంటే తీవ్రస్థాయిలో విమర్శలను ఎదుర్కొనే అవకాశాలు లేకపోలేదంటున్నారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now
Next Story