Fri Nov 22 2024 19:19:05 GMT+0000 (Coordinated Universal Time)
అతివిశ్వాసమే దెబ్బతీసిందా?
రాజకీయ జీవితంలో చంద్రబాబు ఎన్నడూ లేని విధంగా ఇబ్బందులు పడుతున్నారు. గత పదకొండు రోజుల నుంచి రాజమండ్రి జైలులోనే ఉన్నారు
నలభై పదుల రాజకీయ జీవితంలో చంద్రబాబు ఎన్నడూ లేని విధంగా ఇబ్బందులు పడుతున్నారు. గత పదకొండు రోజుల నుంచి రాజమండ్రి జైలులోనే ఉన్నారు. బెయిల్ రాలేదు. న్యాయ పోరాటం ఫలించలేదు. ఆయనకు అన్నీ ప్రతికూల తీర్పులే రావడంతో ఇక ఉన్నత న్యాయస్థానం ఆశ్రయించక తప్పని పరిస్థిితి. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ నేతలు లీగల్ టీంతో సమావేశమై చర్చించారు. హైకోర్టులో క్వాష్ పిటీషన్ కొట్టివేయడంతో ఇక చంద్రబాబు తరుపున న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు. సోమవారం సుప్రీంకోర్టులో పిటీషన్ వేయనున్నట్లు తెలిసింది. లోకేష్ ఢిల్లీలోనే ఉండి న్యాయనిపుణులతో సంప్రదింపులు చేస్తున్నారు.
వరస కేసులు...
చంద్రబాబు చుట్టూ కేసుల ఉచ్చు బిగుసుకుంటుంది. ఆయన తన జీవితంలోనే జైలు గడప తొక్కకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. తనపై నమోదవుతాయని తెలిసిన వెంటనే ముందస్తు బెయిల్ తెచ్చుకోవడం, స్టేలు తెచ్చుకుని ఆయన ఇప్పటి వరకూ నెట్టుకొచ్చారు. కానీ ఈసారి మాత్రం రివర్స్ అయింది. ఆయన ఊహించిన విధంగా జరగలేదు. ఒకవేళ అరెస్టయితే వెంటనే తనకు బెయిల్ వస్తుందని భావించి ఉండవచ్చు. కానీ పథ్నాలుగు రోజులకు పైగానే జైలులో ఉండాల్సి ఉంటుందని ఆయన ఊహకు కూడా అందకపోయి ఉండవచ్చు. స్కిల్ డెవలెప్మెంట్ కేసు మాత్రమే కాదు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, ఫైబర్ నెట్ కేసు వరసగా వెంటపడుతున్నాయి. మరిన్ని కేసులు ఆయనపై నమోదయ్యే అవకాశాలున్నాయి.
తక్కువ అంచనా వేసి...
అసలు జగన్ ను చంద్రబాబు తక్కువ అంచనా వేశారు. ఎన్నికలకు ఇంకా తొమ్మిది నెలల మాత్రమే సమయం ఉండటంతో జగన్ తన జోలికి రాడని భావించారు. ఆ ఆత్మవిశ్వాసంతో తనను ఏమీ పీకలేరంటూ వ్యాఖ్యలు చేశారు. అయితే స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసు ఈ రకంగా మెడకు చుట్టుకుంటుందని చంద్రబాబు భావించలేదు. జగన్ ప్రభుత్వం తనను అరెస్ట్ చేస్తే సానుభూతి వస్తుందని, అందుకే తన అరెస్ట్‌కు ప్రయత్నించకపోవచ్చన్న అంచనాలు తలకిందులయ్యాయి. ఇప్పడు గత కొద్ది రోజులుగా జైలులోనే మగ్గి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. జాగ్రత్త పడి ముందస్తు బెయిల్ దరఖాస్తు చేసుకుని తెచ్చుకుంటే సరిపోయేదని పార్టీ నేతలు కూడా అభిప్రాయపడుతున్నారు.
రేపటి నుంచి విచారణ...
ఇక రేపటి నుంచి సీఐడీ అధికారులు చంద్రబాబును ఈ కేసులో విచారణ చేయనున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల పాటు రాజమండ్రి జైలులోనే విచారణ జరగనుంది. ఈ విచారణలో చంద్రబాబు ఎలాంటి ప్రశ్నలు ఎదుర్కొంటారు? ఎలా జవాబు చెబుతారన్నది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉండగా చంద్రబాబుతో రాజమండ్రి జైలులో న్యాయవాది లక్ష్మీనారాయణ ములాఖత్ అయ్యారు. ఆయన చేత వివిధ పత్రాలపై సంతకాలు తీసుకున్నట్లు తెలిసింది. కోర్టు తీర్పులపై చంద్రబాబుకు ఆయన వివరించినట్లు సమాచారం. తదుపరి కార్యాచరణను కూడా ఇరువురు చర్చించుకున్నారని తెలిసింది.
Next Story