పార్టీ నేతలపై చంద్రబాబు సీరియస్
పార్టీకి వ్యతిరేకంగా మీడియాలో పలువురు నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ అధి నాయకత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఆంధ్రప్రదేశ్: పార్టీకి వ్యతిరేకంగా మీడియాలో పలువురు నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ అధి నాయకత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సొంత పార్టీ నేతలే పార్టీ పరువును బజారున పెడ్తుండడంతో ఆగ్రహంతో ఉంది. పార్టీ నిర్ణయాలను పూర్తిగా పక్కనపెట్టి ఒకటి రెండు చోట్ల నేతలు మీడియాలో చేసిన కామెంట్స్‌పై అధిష్టానం సీరియస్ అయ్యింది. శనివారం ఉదయం పార్టీ వర్గాలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లాలో నేతలు చేసిన కామెంట్స్ పార్టీ వర్గాలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాయి. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ.. పార్టీ కట్టుబాట్లకు వ్యతిరేకంగా, పార్టీకి నష్టం చేసే వారి విషయంలో ప్రేక్షకపాత్ర పోషించాల్సిన అవసరం లేదని అన్నారు.
పార్టీ తీసుకున్న తప్పు బడుతూ.. మీడియాలో కామెంట్స్ చేసిన వారిపై పార్టీ కఠినంగా వ్యహరించాల్సి వస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు. పార్టీ నేతలు ఏవైనా సమస్యలు ఉంటే.. తమ అభిప్రాయాలు పార్టీ అగ్ర నాయకత్వానికి చెప్పాలి.. తప్ప బజారున చర్చ పెట్టడం ఎంత మాత్రం మంచిది కాదన్నారు. పార్టీ క్రమశిక్షణ నిబంధనలను ఉల్లంఘిస్తే ఏ స్థాయి నేతలైనా సహించేది లేదని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇటీవల టీడీపీ అధిష్ఠానంపై కోడెల శివప్రసాదరావు కుమారుడు కోడెల శివరాం కీలక వ్యాఖ్యలు చేసారు. పార్టీలో పనిచేసిన మరణించిన సీనియర్ల కుటుంబ సభ్యులకు ఇచ్చిన ప్రాధాన్యత తమకు ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నించారు.
చంద్రబాబును దూషించిన కన్నాకు సత్తెనపల్లి సీటు ఇచ్చి కోడెల హోదా ఎలా ఇస్తారని ప్రశ్నించారు. తాము చంద్రబాబును కలుద్దామని పలు సార్లు కోరినా అవకాశం దక్కలేదని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే శివరాంకు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మద్ధతు తెలిపారు. ఎన్నికల్లో గెలిచే వారికే సీట్లు ఇవ్వాలని, ఓడుతారని భావిస్తే ముఖం మీద చెప్పాలన్నారు. ఎవరో ట్రస్టులు, ఫౌండేషన్ పేర్లతో కొంత మేర ఖర్చు పెడితే వారికి టికెట్లు ఇస్తారా? అని ప్రశ్నించారు. ఇటీవల టీడీపీ ఎంపీ కేశినేని నాని కూడా వైసీపీకి మద్ధతుగా వ్యాఖ్యలు చేయడం టీడీపీ అధిష్ఠానానికి నచ్చలేదు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఇవ్వకపోయినా ప్రజలకు సేవ చేస్తానని కేశినేని నాని అన్నారు. ఇలా టీడీపీలో అసమ్మతి రాగం వినిపిస్తోంది. మరీ నేతలను సంతృప్తి పర్చేందుకు టీడీపీ ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.