Sun Dec 22 2024 21:51:24 GMT+0000 (Coordinated Universal Time)
వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్ లే కారణం: చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి అంటూ ప్రాజెక్ట్ ల వద్ద సెల్ఫీ లు తీసుకుంటూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సోమవారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును కూడా సందర్శించారు. పోలవరం వద్ద సెల్ఫీ తీసుకుని సీఎం జగన్ కు చాలెంజ్ విసిరారు. వర్షాకాలం పూర్తయితే జగన్ పని అయిపోయినట్లే అని అన్నారు. జగన్ మూర్ఖత్వం వల్లే డయాఫ్రం వాల్ దెబ్బతిన్నదని విమర్శించారు. ఐఐటీహెచ్ నివేదిక మేరకు, వైసీపీ ప్రభుత్వ తీరు వల్లే డయాఫ్రం వాల్ దెబ్బతిన్నట్టు స్పష్టమైందని అన్నారు. 2020లో వచ్చిన 22 లక్షల క్యూసెక్కుల నీటి వల్ల డయాఫ్రం వాల్ దెబ్బతిందని అన్నారు.
వైఎస్ రాజశేఖర్రెడ్డి నిర్వాకం వల్లే పోలవరం పదేళ్లు ఆలస్యమైందని చంద్రబాబు నాయుడు విమర్శించారు. పట్టిసీమ వద్ద ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రాజెక్టుల స్థితిగతులపై ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. 2004లో పోలవరానికి టెండర్లు మధుకాన్, శీనయ్య సంస్థలకు దక్కితే కక్ష సాధింపు చర్యలతో పనులు రద్దు చేశారని ఆరోపించారు. హెడ్ వర్క్స్ను నిర్లక్ష్యం చేసి కమీషన్ల కోసం కాలువ పనులపై దృష్టి పెట్టారని విమర్శించారు. 2004 నుంచి 2014 వరకు కేవలం 5 శాతం పనులు మాత్రమే జరిగాయని విమర్శించారు. రైతులకు పరిహారం ఇవ్వలేదని అన్నారు. పొరుగు రాష్ట్రాలతో వివాదాలూ పరిష్కారం కాలేదన్నారు. అందుకే పోలవరం ఆలస్యం అయిందని చెప్పుకొచ్చారు. పోలవరం ఆపేందుకు గతంలో జగన్ ఎన్నో ప్రయత్నాలు చేశారు. కేంద్రం ఆమోదించకుండా దిల్లీలో జగన్ లాబీయింగ్ చేశారు. అబద్ధాలతో పోలవరం మీద పుస్తకాలు ప్రచురించారు. జగన్ వచ్చాక కమీషన్ల కోసం కాంట్రాక్టులను మార్చారని ఆరోపించారు.
Next Story