ఫైబర్ నెట్ కేసు శుక్రవారానికి వాయిదా
ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ సుప్రీంకోర్టులో టీడీపీ అధినేత
ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ సుప్రీంకోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదిస్తున్నారు. చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం వాదనలు వింటోంది. ఫైబర్ నెట్ కేసు విచారణ కూడా జరగాల్సి ఉండడంతో, ఈ వాదనల మధ్యలో సిద్ధార్థ లూథ్రా జోక్యం చేసుకున్నారు. సమయం 3గంటలు అయిందని, ఫైబర్ నెట్ కేసు విచారణ కూడా ఈరోజు ఉందని గుర్తు చేసారు. ఫైబర్ నెట్ కేసును మరో రోజు చూద్దామని జస్టిస్ బేలా త్రివేది తెలిపారు. ముందు క్వాష్ పిటిషన్ విచారణ ముగిద్దాం అని జస్టిస్ అనిరుద్ధ బోస్ స్పష్టం చేశారు. ఫైబర్ నెట్ కేసు విచారణను శుక్రవారానికి వాయిదా వేస్తున్నామని తెలిపారు. చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా స్పందిస్తూ ఈ కేసులో కోర్టు విచారణ పూర్తయ్యేవరకు చంద్రబాబును అరెస్ట్ చేయొద్దని గతంలో ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాలను కూడా పొడిగిస్తున్నట్టే కదా అని ధర్మాసనాన్ని కోరారు. అందుకు జస్టిస్ అనిరుద్ధ బోస్ బదులిస్తూ.. అవును, అది కూడా పొడిగిస్తున్నట్టే అని స్పష్టం చేశారు. విచారణ ముగిసేంతవరకు అరెస్ట్ చేయవద్దన్న చంద్రబాబు అభ్యర్థనను అంగీకరించాలని ఏపీ ప్రభుత్వానికి సూచన చేసింది ధర్మాసనం.