Sun Dec 22 2024 21:55:13 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : జులై నెలలోనే తీపివార్త .. కానీ జరుగుతున్న ప్రచారంతో అంతా అయోమయంగా.. నమ్మొద్దంటున్న అధికారులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అయితే కీలక ఫైళ్లపై సంతకం పెట్టారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అయితే కీలక ఫైళ్లపై సంతకం పెట్టారు. పింఛన్లను నాలుగు వేల రూపాయలకు పెంచుతూ ఆయన ఫైలును క్లియర్ చేశారు. ఇక నెలవారీ పింఛను జులై నుంచి నాలుగు వేల రూపాయలు అందనుంది. ఇది క్లియర్. అందులో ఎలాంటి సందేహం లేదు. చంద్రబాబు తాము ఎన్నికల మ్యానిఫేస్టో చెప్పినట్లుగానే తొలుత పింఛను పెంపుదల చేసి జనంలోకి ప్రభుత్వం పట్ల పాజిటివ్ టాక్ తీసుకు వెళ్లేలా ప్రయత్నం అయితే ప్రారంభించారు. ఆయన ఎన్నికల ప్రచారంలో చెప్పింది చెప్పినట్లుగానే మెగా డీఎస్సీ, ల్యాండ్ టైటలింగ్ యాక్ట్, పింఛన్ల పెంపుదల వంటి వాటిపై సంతకాలు చేశారు. ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ రద్దుతో చాలా మందికి చంద్రబాబు భరోసా కల్పించినట్లయిందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. ముఖ్యంగా రైతుల్లో ఈ యాక్ట్ రద్దు చేయడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
నెలకు నాలుగువేలు...
ఇక వృద్ధులు కూడా నెలకు నాలుగువేల రూపాయల పింఛను అందుతుందని అందరూ ఆశగా ఉన్నారు. అయితే ప్రస్తుతం 65 లక్షల మంది వరకూ సామజిక పింఛన్లు అందుతున్నాయి. వీరందరీకీ నాలుగు వేల రూపాయల పింఛను అందుతుందా? అన్న అనుమానం కలుగుతుంది. గత ప్రభుత్వ హయాంలో అనర్హులకు కూడా పింఛను ఇచ్చారన్న ఆరోపణల నేపథ్యంలో పింఛను అర్హత ఉన్నవారికే అందించేలా కొత్త ప్రభుత్వం చర్య తీసుకుంటుందన్న ప్రచారం అయితే జోరుగా సాగుతుంది. అర్హతలు లేకున్నా కేవలం కొన్ని కారణాలతో కొందరికి పింఛన్లను గత ప్రభుత్వంలో మంజూరు చేసినట్లు అధికార పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అనర్హులకు కూడా పింఛన్లు మంజూరు చేయడమే కాకుండా వారికి పధకాలను కూడా అనేకం అందించినట్లు అనేక చోట్ల నుంచి ప్రభుత్వానికి ఆరోపణలు అందుతున్నాయి.
అనర్హులకు...
ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రభుత్వం గతంలో ఉన్న వారందరికీ పింఛన్లను మంజూరు చేస్తుందా? లేక అర్హతలను పరిశీలించిన తర్వాత మాత్రమే నెలకు నాలుగు వేల రూపాయల పింఛను అందిస్తారా? అన్నది తేలాల్సి ఉంది. అయితే జులై నెలకు సంబంధించి పెద్దగా సమయం లేకపోవడంతో అర్హతలను పరిశీలించే సమయం లేకపోవచ్చు అంటున్నారు. ఆగస్టు నెల నుంచి పింఛన్లు ఎవరెవరికి అందుతున్నాయి? అందులో అర్హులెవరు? అనర్హులు ఎవరు? అన్న దానిపై లోతైన విచారణ జరపాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరి చంద్రబాబు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.
నమ్మొద్దంటున్న....
ఎందుకంటే అనర్హులకు ప్రభుత్వ సొమ్మును ఇవ్వకూడదన్న నిర్ణయాన్ని కఠినంగా అమలు చేయాలన్న చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయాలని భావిస్తుండటంతో ఈ అనుమానాలు బయలుదేరాయి. అయితే దీనిపై అధికార వర్గాల నుంచి మాత్రం ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. సోషల్ మీడియాలో జరగుతున్న ప్రచారాన్ని ఎవరూ నమ్మాల్సిన అవసరం లేదంటున్నారు. అందరికీ పింఛన్లు అందిస్తామని అధికారులు అనధికారికంగా చెబుతున్నారు. మంత్రులు కూడా ప్రస్తుతం పింఛను అందుకుంటున్న వారందరికీ ఇంటింటికీ తిరిగి అందచేస్తారని స్పష్టం చేశారు. అయితే వస్తున్న వార్తలతో పింఛనుదారులలో అయోమయం ఏర్పడింది. మొత్తం మీద అందరికీ జులై నెలకు పింఛన్లు నాలుగు వేల చొప్పున అందుతాయని మాత్రం అధికారిక వర్గాలు చెబుతున్నాయి.
Next Story