Tue Apr 22 2025 14:37:23 GMT+0000 (Coordinated Universal Time)
Amaravathi : చంద్రబాబు డ్రీమ్ ప్రాజెక్టు సక్సెస్ అవుతుందా? ఎన్నో అనుమానాలు?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతిపై అంచనాలు అధికంగా పెట్టుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతిపై అంచనాలు అధికంగా పెట్టుకున్నారు. అయితే అది ఎంత వరకూ సక్సెస్ అవుతుందన్నది మాత్రం ఇప్పటి వరకూ తేలలేదు. రాజధాని అమరావతిలో కేవలం భవనాలు నిర్మించి, రోడ్లు అధునాతంగా వేస్తేనే సరిపోదు.అలాగే ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేస్తే ఉపయోగం ఉండదు. ప్రయివేటు పరిశ్రమలు ఏర్పాటయినా అక్కడ ఎక్కువ మంది నివాసం ఉంటేనే రాజధాని అభివృద్ధి సాధ్యమవుతుంది. అంతా వాణిజ్యపరంగా అభివృద్ది చెందాలనుకున్నా ఉపయోగముండదన్నది నిపుణుల అంచనా. ఎయిర్ పోర్టులు, రైల్వే లైన్ లు నిర్మించినప్పటికీ జనం ఫ్లోటింగ్ అక్కడ ఎక్కువ ఉండ తీరాలి.
నివాసం ఉండేందుకు...
అయితే రాజధాని ప్రాంతంలో నివాసం ఉండేందుకు ఎంత మంది ఇష్టపడతారన్నది ఇప్పుడు అధికార పార్టీని కూడా వేధిస్తున్న ప్రశ్న. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి మాత్రమే కాకుండా రాజధాని అనేది అందరికీ అందుబాటులో భూముల ధరలు ఉంటేనే అక్కడ స్థిరపడతారు. అంతే తప్ప ఎక్కువ ధర పెట్టి కొనుగోలు చేయాలంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులు, సంపన్నులు మినహా మధ్య తరగతి, పేద ప్రజలు ఎక్కువ మంది రాజధాని ప్రాంతానికి తరలి వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పటికే అక్కడ భూముల ధరలు ఆకాశాన్నంటాయి. రైతులకు ఇచ్చిన ఫ్లాట్లు కూడా వారు ఇతరులకు విక్రయించే అవకాశం లేదు. ఒకవేళ ఒకరో ఇద్దరో విక్రయించినా అత్యధిక ధర చెబుతుండటంతో వాటిని కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చే వాళ్లు తక్కువగానే ఉంటారన్నది అంచనా.
అదనపు భూమిని...
ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం రాజధాని కోర్ కాపిటల్ కు బయట మరో నలభై నాలుగు వేల ఎకరాల భూమిని సేకరించాలన్న లక్ష్యంగా పెట్టుకుంది. రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని ప్రభుత్వం చెబుతుంది. ఈ మేరకు ప్రభుత్వం ప్రతిపాదనలను సిద్ధం చేసింది. ప్రస్తుతం రాజధాని అమరావతిలో అన్నింటికీ పోగా, అన్ని అవసరాలకు వినియోగించగా కేవలం మిగిలేది రెండు వేల ఎకరాలు మాత్రమే. చంద్రబాబు నాయుడు అనుకున్నట్లు ఆ భూమిని విక్రయించినా రాజధాని అమరావతి కోసం చేసిన అప్పులు తీరవన్నది అందరికీ తెలిసిందే. రెండు వేల ఎకరాల భూమిని విక్రయించడానికి ప్రభుత్వం ముందుకు వచ్చినా ప్రభుత్వం ఆశించిన రీతిలో సంపద సృష్టి అనేది సాధ్యం కాకపోవచ్చు.
77 వేల ఎకరాలను సమీకరించి...
అందుకే మరో 44 వేల ఎకరాల భూమిని సేకరించాలన్న లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం రైతులను ఒప్పించి తీసుకోవడానికి సిద్ధమయింది. అటే ముందు సేకరించిన 33 వేల ఎకరాలకు తోడు, అదనంగా ప్రస్తుతం సేకరించే 44 వేల ఎకరాలు కలిపితే మొత్తం 77 వేల ఎకరాల భూమిని సేకరించినట్లవుతుంది. ఇందులో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుకే నాలుగు వేల ఎకరాలు అవసరం అవుతుందని అంచనాలున్నాయి. ఈపరిస్థితుల్లో ఇంత పెద్ద స్థాయిలో రైతుల నుంచి భూములను సేకరించిన తర్వాత అక్కడ భవిష్యత్ పరిస్థితి ఎలా ఉంటుందన్నది అధికారులకు కూడా అర్థం కావడం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డ్రీమ్ ప్రాజెక్టు కావడంతో దీనిని సక్సెస్ చేయాలని భావిస్తున్నారు.అయితే ఇప్పటికిప్పుడు అభివృద్ధి కాకపోయినా దశాబ్దన్నర కాలం తర్వాత అయినా రాజధాని ప్రాంతం అభివృద్ధి చెందే అవకాశాలున్నాయన్న ఆశ మాత్రం అందరిలోనూ ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Next Story