డ్రైవర్ సుబ్రహ్మణ్యం భార్యకు ఫోన్ చేసిన చంద్రబాబు.. ఫోరెన్సిక్ రిపోర్టులో ఏముందంటే..!
గర్భవతిగా ఉన్న అపర్ణకు ఎంతో కష్టం వచ్చిందని.. చంద్రబాబు తీవ్ర అవేదన వ్యక్తం చేశారు.
హత్యకు గురైన వైసిపి ఎమ్మెల్సీ అనంతబాబు కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం భార్య అపర్ణను టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఫోన్ లో పరామర్శించారు. గర్భవతిగా ఉన్న అపర్ణకు ఎంతో కష్టం వచ్చిందని.. చంద్రబాబు తీవ్ర అవేదన వ్యక్తం చేశారు. సుబ్రహ్మణ్యం హత్యకు అనంతబాబే కారణం అని అపర్ణ చంద్రబాబు నాయుడుకు వివరించింది. తెలుగుదేశంతో పాటు దళిత సంఘాలు చేసిన పోరాటం వల్లనే పోలీసులు చివరికి హత్య కేసుగా నమోదు చేశారని అపర్ణ చెప్పింది. తనను పోలీసులు తీవ్రంగా వేధించారని...ప్రభుత్వం తనను ప్రలోభ పెట్టే ప్రయత్నాలు చేసిందని, కేసును నీరు గార్చేందుకు ప్రయత్నం చేశారని ఆరోపించింది. పోలీసుల విచారణపై తనకు అనుమానాలు ఉన్నాయని...తన భర్త హత్య కేసులో సిబిఐతో విచారణ జరిపించాలని అపర్ణ డిమాండ్ చేసింది. దైర్యంగా ఉండాలని, అన్ని విధాలా పార్టీ తరపున అండగా ఉంటామని చంద్రబాబు అపర్ణకు తెలిపారు. నిందితుడు అనంత బాబు బహిరంగంగా తిరుగుతున్నా పోలీసులు అరెస్టు చెయ్యకపోవడాన్ని చంద్రబాబు తీవ్రంగా తప్పు పట్టారు. కళ్లముందు పెళ్లిళ్లకు, పేరంటాలకు నిందితుడు వెళుతుంటే ఇప్పటికీ అరెస్టు చేయకపోవడం దారుణమన్నారు చంద్రబాబు. సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితులుకు శిక్ష పడేవరకు టీడీపీ పోరాటం చేస్తుందని చంద్రబాబు అన్నారు.