Fri Nov 22 2024 18:55:20 GMT+0000 (Coordinated Universal Time)
తిరుమలలో చిన్నారి మృతిపై చంద్రబాబు స్పందన
తిరుమల అలిపిరి మార్గంలో చిరుత దాడిలో చిన్నారి మృతి చెందిన ఘటనపై టీడీపీ అధినేత
తిరుమల అలిపిరి మార్గంలో చిరుత దాడిలో చిన్నారి మృతి చెందిన ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. పాప తల్లిదండ్రులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానంటూ ఆయన ట్వీట్ చేశారు. ‘‘కుటుంబ సభ్యులతో కలిసి అలిపిరి మార్గంలో తిరుమల కొండకు కాలినడకన వెళ్తున్న ఆరేళ్ల చిన్నారి లక్షిత చిరుత దాడిలో మృతి చెందడం అత్యంత విషాదకరం. కళ్లముందే క్రూర జంతువు కూతురిని లాక్కెళ్లిపోతే ఆ బాధ వర్ణనాతీతం. పాప తల్లిదండ్రులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా” అని పేర్కొన్నారు. కొన్ని రోజుల క్రితం చిరుత దాడిలో బాలుడు గాయపడ్డ ఘటన జరిగిందని.. అప్పుడే టీటీడీ మరిన్ని రక్షణ చర్యలు చేపట్టి ఉంటే ఈ ఘోరం తప్పేదని అన్నారు. తగిన రక్షణ చర్యలతో భక్తుల భయాన్ని తొలగించాలని సూచించారు.
తిరుమలలో అలిపిరి నడక మార్గంలో మిస్సింగ్ అయిన ఆరేళ్ల పాప లక్షితను చంపినది చిరుతపులి అని ఫోరెన్సిక్ నిపుణులు తేల్చారు. తిరుపతి రుయా ఆస్పత్రిలో చిన్నారి మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించారు. ఇందులో పాపను చంపినది చిరుతపులే అని ఫోరెన్సిక్ నిపుణులు తెలిపారు. పాప మృతదేహాన్ని తల్లిదండ్రులు జిల్లాకి తరలించారు. పాప తల్లి శశికళ, తండ్రి ఎంతో విషాదంలో మునిగిపోయారు. గతేడాది కూడా తిరుమల వచ్చి.. ఇలాగే కాలినడకన కొండపైకి వెళ్లామనీ అప్పుడు కూడా పాప ఇలాగే వేగంగా మెట్లు ఎక్కుతూ ముందుకు వెళ్లిందనీ శశికళ తెలిపింది. అప్పుడు ఏమీ కాలేదనీ.. ఇప్పుడు కూడా పాప ఇలాగే చేసిందనీ కానీ ఇలా అవుతుందని తాము అనుకోలేదని తల్లి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. భక్తులు గుంపులుగా వెళ్లాలనీ, రాత్రివేళ కాలినడక మార్గాల్లో రావొద్దని టీటీడీ తాజాగా తెలిపింది. నెల్లూరు జిల్లాకి చెందిన శశికళ కుటుంబం నిన్న రాత్రి శ్రీవారి దర్శనానికి వచ్చింది. అలిపిరి నడక మార్గంలో పాప మిస్సింగ్ అయ్యింది. పాప కోసం రాత్రంతా వెతికారు. పోలీసులకు కంప్లైంట్ కూడా ఇచ్చారు. దాదాపు 70 మంది వెతికినా పాప కనిపించలేదు.
Next Story