Mon Dec 23 2024 08:29:03 GMT+0000 (Coordinated Universal Time)
నేడు కుటుంబ సభ్యుల ములాఖత్?
రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబు నాయుడుకు మరికాసేపట్లో వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు
రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబు నాయుడుకు మరికాసేపట్లో వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. తెల్లవారు జామున రావడంతో ఆయన అలసట చెంది ఉండటంతో వయసు రీత్యా వైద్య పరీక్షలు నిర్వహించాలని జైలు అధికారులు నిర్ణయించారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో స్నేహ అప్పర్ బ్లాక్ లోని ప్రత్యేక గదిలో ఆయనను ఉంచారు. ఆ చుట్టుపక్కల మరెవ్వరూ ఖైదీలు ఉండకుండా జైలు అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.
భోజనాన్ని...
అయితే చంద్రబాబుకు ఇంటి నుంచి భోజనం నుంచి తెప్పించుకునే వెసులుబాటు ఉండటంతో మరికాసేపట్లో ఆయనకు ఇంటి నుంచి అల్పాహారం అందించనున్నారు. ఈరోజు ముగ్గురు కుటుంబ సభ్యులు ములాఖత్ అయ్యే అవకాశాలున్నాయని తెలిసింది. ఈరోజు రాజమండ్రి సెంట్రల్ జైలుకు ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు నారా లోకేష్, కోడలు బ్రాహ్మణిలు వచ్చి చంద్రబాబుతో ములాఖత్ అయ్యే అవకాశముంది. వారానికి ఒక రోజు మాత్రమే ములాఖత్ కు అవకాశం ఉంటుంది.
144వ సెక్షన్...
ఈ వారానికి ముగ్గురికి మాత్రమే ములాఖత్ కు అనుమతిస్తామని జైలు అధికారులు చెబుతున్నారు. ఈరోజు ముగ్గురు కుటుంబ సభ్యులకు ములాఖత్ కు అనుమతి ఇచ్చారు. ఇంటి నుంచి భోజనం తెప్పించుకోవడానికి కూడా అనుమతి ఉండటంతో ఆయనకు అందించే భోజనాన్ని అధికారులు పరిశీలించిన తర్వాతనే లోపలికి పంపుతారు. రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద 144వ సెక్షన్ విధించారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు అటు వైపు రాకుండా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.
Next Story