Sun Nov 17 2024 23:29:22 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : వారిని ఎన్నికల విధుల నుంచి తొలగించాలని కోరాం
ఎన్నికలను అపహాస్యం చేసేలా ప్రభుత్వం వ్యహరిస్తుందని కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశామని చంద్రబాబు తెలిపారు
ఎన్నికలను అపహాస్యం చేసేలా ప్రభుత్వం వ్యహరిస్తుందని కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశామని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో కలసి ఆయన కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిశారు. ఓటర్ల జాబితాలో పెద్దయెత్తున అవకతవకలు జరిగాయన్నారు. ఒక్క చంద్రగిరి నియోజకవర్గంలోనే పెద్దయెత్తున ఓట్లు గల్లంతయ్యాయని, దొంగఓట్లు నమోదు చేయించారని అన్నారు. ప్రతిపక్షాలపై ఇష్టానుసారం కేసులు పెడుతున్నారని ఫిర్యాదు చేశామన్నారు. ఆరు నుంచి ఏడు వేల మందిపై కేసులు పెట్టారని చంద్రబాబు అన్నారు. తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగిందన్నారు. అలాగే ఇక్కడ కూడా జరగాలని కోరారన్నారు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని...
సచివాలయ ఉద్యోగులను ఉపయోగించుకుని ఎన్నికల్లో గెలవాలని ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని తాము ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని చెప్పారు. ప్రజాస్వామ్యం కోసం మా వంతు మా ప్రయత్నాలు చేశామన్నారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లిన వారికి ఇక్కడ ఓటు ఇవ్వాలని ఆయన కోరారు. సచివాలయ సిబ్బందిని ఎన్నికల ప్రక్రియలో భాగం చేయవద్దని కూడా ఎన్నికల సంఘాన్ని కోరినట్లు తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు. ప్రతి అధికారిపై తాము ఆధారాలతో సహా వారికి అందించామని, వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చంద్రబాబు కోరారు. ఎన్నికల సంఘం తక్షణ చర్యలు తీసుకుంటుందని తమకు నమ్మకం ఉందని చంద్రబాబు తెలిపారు.
లా అండ్ ఆర్డర్ దెబ్బతినిందని...
వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి లా ఆర్డర్ దిగజారిపోయిందని, ప్రతిపక్షాలపై కేసులు నమోదు చేస్తున్నారని, వారిపై బైండోవర్ కేసులు పెడుతున్నారని చెప్పానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. మహిళ కానిస్టేబుల్ ను బీఎల్ఓగా నియమించడంపై తాము అభ్యంతరం తెలిపామని చెప్పారు. ఎన్నికలను పారదర్శకంగా, స్వేచ్ఛగా జరుపుతామని ఎన్నికల అధికారి తమకు హామీ ఇచ్చామన్నారు.
Next Story