Mon Dec 23 2024 03:45:09 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : అన్స్టాపబుల్ విక్టరీ ఇది... ఊహించని విజయాన్ని నిలుపుకోవాలి
గతంలో ఎన్నడూ లేని విధంగా చూడని విజయాన్ని ఈరోజు చూశామని చంద్రబాబు అన్నారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా చూడని విజయాన్ని ఈరోజు చూశామని చంద్రబాబు అన్నారు. శాసనభ పక్షనేతగా ఎన్నికయిన అనంతరం చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. ఎనిమిది జిల్లాల్లో కూటమి క్లీన్ స్వీప్ చేసిందన్నారు. శ్రీకాకుళం నుంచి కడప వరకూ చూస్తే ఎక్కడ చూసినా విజయాలేనని అన్నారు. చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా కడపలో ఏడు సీట్లకు మూడు సీట్లలో గెలిచామని తెలిపారు. జనసేన 21 సీట్లను తీసుకుని 21 గెలిచారన్నారు. పది సీట్లు తీసుకున్న బీజేపీ ఎనిమిది సీట్లలో గెలిచిందన్నారు. ఈ ఎన్నికల్లో మరో విషయం ఏంటంటే.. ఎన్నికలు పూర్తయిన తర్వాత ఎక్కడా ఎన్నికల్లో సహకరించలేదని ఒక్క ఫిర్యాదు కూడా అందలేదన్నారు.
నమ్మకం పెట్టుకున్నారు...
ప్రజలు ఈ ఎన్నికల్లో తమపై నమ్మకం పెట్టుకున్నారన్నారు. ఈ రాష్ట్రంలో ప్రజలు ఇచ్చిన తీర్పు వల్లనే ఢిల్లీలో మనకు గౌరవం దక్కిందన్నారు. ఏపీ ప్రతిష్ట పెరిగిందన్నారు. అభ్యర్థుల ఎంపిక సమయంలో అన్ని విషయాలు ఆలోచించామని, చిన్న చిన్న సమస్యలు తప్ప ఎక్కడా పెద్ద సమస్యలు ఎక్కడా రాలేదన్నారు. అందరూ సమన్వయంతో పనిచేసి పార్టీ విజయానికి కారకులయ్యారన్నారు. ఇలాంటి విజయాన్ని తాను ఎప్పుడు చూడలేదన్నారు. తాను జైల్లో ఉన్నప్పుడు తనను పరామర్శించడానికి వచ్చి జనసేన, టీడీపీ పొత్తు పెట్టుకుంటున్నామని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కల్యాణ్ అని అన్నారు. మూడు పార్టీలు కలసి పోటీ చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పవన్ చేసిన కృషి ప్రశంసనీయమన్నారు.
అందరి కృషి...
ఓట్లు బదిలీ అవుతుందా? లేదా? అన్న అనుమానం ఎన్నికలకు ముందు ఉండేదని చంద్రబాబు అన్నారు. కోవూరులో మూడు పార్టీలు కలసి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి ఆరు జిల్లాల్లో పర్యటించామని తెలిపారు. నరేంద్ర మోదీ, అమిత్ షాలు వచ్చి ప్రజలకు స్పష్టత ఇచ్చారన్నారు. అందరి కలయికే మన విజయమని చంద్రబాబు అన్నారు. అందరూ అభ్యర్థులు ఈ ఎన్నికల్లో పడిన కష్టాన్ని ఎప్పుడూ చూడలేదన్నారు. మీ అందరి సహకారంతో రేపు తాను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్నానని, మోదీ, ఎన్డీఏ నేతలు కూడా వస్తున్నారని తెలిపారు. ప్రజల రుణం తీర్చుకునే సమయం ఆసన్నమయిందని చంద్రబాబు అన్నారు. అందుకు కేంద్ర సహకారం అవసరమని చంద్రబాబు అన్నారు. మోదీ, అమిత్ షాలు కూడా రాష్ట్రానికి సహకరిస్తామని హామీ ఇచ్చారని ఈ సమావేశంలో తెలిపారు. అహంకారాన్ని ప్రజలు హర్షించరని ఈ ఎన్నికలు నిరూపించాయన్నారు.
ఈ ఎన్నిక కేస్ స్టడీ...
ఈ ఎన్నిక ఒక కేస్ స్టడీ అవుతుందన్నారు. మనం కూడా కక్ష తీర్చుకోవాలని ముందుకు పోకూడదని, అదే సమయంలో తప్పు చేసిన వాడిని క్షమించకూడదు.. చట్టపరంగా శిక్షించాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు. కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారన్నారు. దాడులు చేశారన్నారు. అయినా సరే వళ్లు నిద్ర పోకుండా పార్టీని కాపాడుకున్నారన్నారు. తన కుటుంబానికి జరిగిన అవమాన్ని భరించలేక సభ నుంచి బయటకు వచ్చానన్నారు. గౌరవించిన ప్రజలను మనం విస్మరించకూడదన్నారు. శాసనసభను గౌరవ సభగా తీర్చిదిద్దుతానని ఆయన తెలిపారు. ప్రజా పాలన అందిస్తామని చెప్పారు. లోతుగా పరిశీలిస్తే తప్ప ఎంత అప్పు చేశారో కూడా తెలియదన్నారు. వీటన్నింటినీ అధిగమించి మనం రాష్ట్ర అభివృద్ధి దిశగా పయనించాలని ఆయన శాసనసభ్యులకు పిలుపు నిచ్చారు.
Next Story