Mon Nov 18 2024 03:43:18 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : చంద్రబాబు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పనున్న సర్కార్...ఆ పన్ను రద్దు దిశగా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టిన చంద్రబాబు నాయుడు వరస నిర్ణయాలు తీసుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టిన చంద్రబాబు నాయుడు వరస నిర్ణయాలు తీసుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి చంద్రబాబు తాను ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలతో పాటు తాను చేసిన విమర్శలను తన ప్రభుత్వంపై పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో చెత్త పన్నును రద్దు చేయాలని నిర్ణయానికి వచ్చారు. అయితే దీనికి సంబంధించిన ఉత్తర్వులను త్వరలో విడుదల చేయనున్నారు.
చెత్త పన్ను పేరిట...
గత ప్రభుత్వం చెత్త పన్ను పేరిట ప్రభుత్వం నుంచి డబ్బులు వసూలు చేసింది. చెత్త పన్ను కూడా వేశారంటూ చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో విమర్శలు చేస్తూ వచ్చారు. ప్రజలు కూడా చెత్త పన్నును వ్యతిరేకించినా గత ప్రభుత్వం మాత్రం క్లీన్ అండ్ గ్రీన్, ప్రజల్లో జవాబుదారీతనం కోసమే తాము పన్నును వసూలు చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది. అంతేతప్ప చెత్త పన్నును మాత్రం రద్దు చేయలేదు. ఇంటింటికీ చెత్తను సేకరించడం మున్సిపల్ సిబ్బంది విధుల్లో భాగమైనా దానికి పన్ను వేయడమేంటని నాడు చంద్రబాబు సూటిగానే ప్రశ్నించారు.
రద్దు ఉత్తర్వులు...
అయితే తాను అధికారంలోకి రాగానే అదేచెత్త పన్నును రద్దు చేయాలని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలిసింది. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ మాట్లాడుతూ త్వరలోనే చెత్తపన్నును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రజలు ఇకపై చెత్త పన్ను చెల్లించాల్సిన పనిలేదని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పలు కీలక నిర్ణయాల్లో భాగంగా ఈ చెత్త పన్ను రద్దు చేసి ప్రజల మనసులను గెలుచుకోవాలని చంద్రబాబు ప్రభుత్వం భావిస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించి ఉత్తర్వులు వెలువడనున్నాయి.
Next Story