Sat Jan 11 2025 18:51:18 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : రాజధాని అమరావతి వాసులకు గుడ్ న్యూస్.. ఇక నిరంతరాయంగా విద్యుత్తు
అమరావతి వాసులకు చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పనున్నారు. రాజధాని అమరావతిలో నిరంతరం విద్యుత్తు సరఫరా చేయనున్నారు
అమరావతి వాసులకు చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పనున్నారు. రాజధాని అమరావతిలో నిరంతరం విద్యుత్తు సరఫరా చేసేందుకు అవసరమైన చర్యలను ప్రభుత్వం తీసుకుంటుంది. ఇందులో భాగంగా ఈరోజు అమరావతిలో ఐదు సబ్స్టేషన్లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. నాణ్యమైన విద్యుత్తును ఎటువంటి అంతరాయం లేకుండా అమరావతి ప్రాంతంలో అందించే విధంగా ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. రాజధానికి అవసరమైన విద్యుత్తు సరఫరాను నిరంతరాయంగా ఇచ్చేందుకు ఈ సబ్ స్టేషన్ల నిర్మాణం ఉపయోగపడనుంది. అమరావతి ప్రాంతంలో మొత్తం పథ్నాలుగు సబ్ స్టేషన్లను చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. రాజధాని అమరావతి భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని వీటిని ఏర్పాటు చేస్తున్నారు.
రాజధానిపై ఫోకస్...
గత ప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతి ప్రాంతం పూర్తిగా నిర్లక్ష్యానికి గురయింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని నిర్మాణానికి తొలి ప్రాధాన్యత ఇస్తుంది. ఇప్పటికే రాజధాని నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకు నుంచి పదిహేను వేల కోట్ల రూపాయల నిధులను సమీకరిస్తుంది. అదే సమయంలో తొమ్మిది నెలల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు, ఐఏఎస్ క్వార్టర్ల సముదాయం భవనాలను పూర్తి చేయాలని చంద్రబాబు ఆదేశించారు. మరోవైపు రాజధాని అమరావతిలో కొత్తగా సెక్రటేరియట్, అసెంబ్లీ భవనం, హైకోర్టు ను నిర్మించాలన్న ఉద్దేశ్యంతో ఉన్నారు. వీటికి సంబంధించిన టెండర్లను డిసెంబరు నెలలో ఆహ్వానించే అవకాశముంది. మూడేళ్లలో వీటిని పూర్తి చేయాలన్న లక్ష్యంతో పెట్టుకున్నారు.
నిరంతరాయ విద్యుత్తు సరఫరా...
దీంతో అంతకు ముందుగానే నిరంతరాయంగా విద్యుత్తు సరఫరాను అందించాలన్న లక్ష్యంతో నేడు సబ్ స్టేషన్లను ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. 400/220 కేవీ గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్ స్టేషన్ ఈరోజు ప్రారంభించనున్నారు. తాళ్లాయపాళెంలో ఇప్పటికే ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాజధానిలోని అన్ని ప్రాంతాలకు ఎట్టిపరిస్థితుల్లో కరెంట్ సరఫరా నిలిచిపోకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు. అందులోభాగంగానే నేడు చంద్రబాబు ఈ ప్రక్రియను ప్రారంభించనున్నారు. దీంతో రాజధాని ప్రాంతాలకు కూడా ఇక కరెంట్ కట్ ఉండదు. రాజధాని అమరావతి ప్రాంతంలో అన్ని రకాల సౌకర్యాలను కల్పించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుంది.
Next Story