Mon Dec 23 2024 14:11:50 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : చంద్రబాబుకు తెలియకుండానే టీడీపీ నేతలు నాలుగు చేతులా సంపాదిస్తున్నారా?
చంద్రబాబు నాయుడు కళ్లు కప్పి మరీ టీడీపీ నేతలు అడ్డంగా దోపిడీకి పాల్పడుతున్నారు
అవును.. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఇదే చర్చనీయాంశమైంది. చంద్రబాబు నాయుడు కళ్లు కప్పి మరీ టీడీపీ నేతలు అడ్డంగా దోపిడీకి పాల్పడుతున్నారు. చంద్రబాబు నాయుడుకు మాత్రం క్షేత్ర స్థాయిలో సమాచారం అందకపోవడంతో అంతా ఒకే అని అనుకుంటున్నారు. ఆయన దగ్గర ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ను క్రియేట్ చేస్తున్నారు. ఇదంతా ఎక్కడో కాదు. ఉచిత ఇసుక పంపిణీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ప్రహసనంగా మారింది. ఇది రానున్న కాలంలో ప్రభుత్వానికి పెద్దయెత్తున చెడ్డ పేరు తెచ్చే అవకాశముందంటున్నారు. అధికారులు కూడా చూసీ చూడనట్లు వ్యవహరిస్తుండటంతో ఉచిత ఇసుకను టీడీపీ నేతలు సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు గుప్పు మంటున్నాయి.
తమకు అనుకూలంగా...
తెలుగుదేశం పార్టీ ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉంది. పార్టీ అధికారంలోకి రావడానికి ద్వితీయ శ్రేణి నాయకులు దగ్గర నుంచి అందరూ సమిష్టి కృషి చేశారు. అందుకే అంత పెద్దయెత్తున విజయం లభించింది. కూటమిగా ఏర్పడినా ఓట్లు బదిలీని సక్రమంగా చేయించడం వల్లనే ఇంతటి సూపర్ విక్టరీని కొట్టగలిగింది. అయితే అధికారంలోకి రావడానికి టీడీపీ నేతలు బాగానే ఖర్చు పెట్టారు. ఇప్పుడు వాటన్నింటినీ రికవరీ చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. అందుకు ఉచిత ఇసుక విధానాన్ని తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు. ప్రభుత్వం సదుద్దేశ్యంతో ప్రవేశపెట్టిన ఈ విధానాన్ని టీడీపీ నేతలు కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు.
ఇసుకను తోడి...
తామే ఇసుకను తోడి రవాణా చేస్తూ అందిన కాడికి దోచుకుంటున్నారు. ఒక్కొక్కటిగా ఈ విషయాలు బయటపడతున్నాయి. దాదాపు ఎక్కువ నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యేల ప్రధాన అనుచరులు ఈ దోపిడీకి తెరదించారు. కొన్ని చోట్ల ఎమ్మెల్యేల ప్రమేయం కూడా ఉందంటున్నారు. రెండు రోజుల క్రితం శ్రీకాళహస్తి నియోజకవర్గంలో బొజ్జల సుధీర్ తమ అనుచరులు అక్రమంగా ఇసుక దోపిడీ చేస్తున్నారని పత్రికల్లో కథనాలు వచ్చిందానిపై రిపోర్టర్ కు వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఈ నియోజకవర్గంలో పెద్దయెత్తున ఇసుక దందా జరుగుతుందని అర్థమయిపోతుంది. దీనిపై చంద్రబాబు సీరియస్ అయినట్లు సమాచారం.
అనేక నియోజకవర్గాల్లో...
మరోవైపు తాడిపత్రిలోనూ అదే జరుగుతుంది. ఈ విషయాన్ని టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి స్వయంగా వీడియో విడుదల చేయడం సంచలనమే అయింది. తన దగ్గర పనిచేేసే వాళ్లే ఇసుక వ్యాపారం చేస్తున్నారన్నారు. తన అనుచరులు ఇరవై ఐదు మంది వరకూ ఇసుక వ్యాపారం చేసుకుంటూ డబ్బులు సంపాదించుకుంటున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి స్వయంగా చేసిన వ్యాఖ్యలు ఉచిత ఇసుక విధానానికి అద్దం పడుతున్నాయి. ఇలా అనేక నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉందన్న కథనాలు వస్తున్నాయి. భవన నిర్మాణ కార్మికుల కోసం, నిర్మాణ పనులు వేగంగా జరగడానికి, రియల్ ఎస్టేట్ విస్తరించడానికి ఉపయోగపడుతుందని చంద్రబాబు ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తే దానికి టీడీపీ నేతలే గండి కొడుతుండటం హాట్ టాపిక్ గా మారింది.
Next Story